కరోనాని కాదని… ‘కాన్స్’ కళకళలాడుతుందా? ప్రపంచ సినిమా వాణిజ్యానికి ‘లిట్మస్’ పరీక్ష…

74వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదలైపోయింది! ఈసారి జరుగుతోన్న కాన్స సంబరం నిజంగా చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఇంతకు ముందు 73 సార్లు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. పోయిన సంవత్సరం కాన్స్ ఉత్సవం దాదాపుగా ఆన్ లైన్ లోనే జరిగిపోయింది. కరోనా వైరస్ సినిమా సెలబ్రిటీల్ని, దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని… ఇలా అందర్నీ హౌజ్ అరెస్ట్ చేసేసింది. కానీ, 74వ కాన్స్ ఫెస్టివల్ 2021లో మరోసారి పాత పద్ధతిలో జరుగుతోంది. యూరోప్, అమెరికాల నుంచీ వేలాది మంది తరలి వస్తున్నారు. ఇంకా ఆసియా నుంచీ సినీ ప్రియులు, సినీ ప్రముఖులు రాలేకపోతున్నప్పటికీ యూరప్ ఖండం మాత్రం ఈసారి ఒళ్లు విరుచుకుని ఇళ్లలోంచి బయటకు వస్తోంది. కాన్స్ లో ఒకింత జోష్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి…

ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ లో జరిగే ప్రతిష్ఠాత్మక ఉత్సవం ఈ సంవత్సరం ఎంతో కీలకంగా మారింది. ఎందుకంటే, ఈ ఫెస్టివల్ లో ఏదో నాలుగు చిత్రాలు ప్రదర్శించి, అవార్డులు ప్రకటించి వెళ్లిపోరు. వందల కోట్ల రూపాయల డీల్స్ జరుగుతాయి. కాన్స్ లో ప్రదర్శనకు వచ్చిన సినిమాలు అమ్మటం, కొనటం జరుగుతుంటుంది. అలాగే, కొత్త టాలెంట్, కొత్త పార్టనర్స్ ఫిల్మ్ మేకర్స్ కి ఇక్కడ లభిస్తుంటారు! అంటే… ఒక విధంగా… కాన్స్ ఉత్సవం ప్రపంచ సినిమాకు సంత లాంటిది! మరి ఈసారి ఇంకా ప్యాండమిక్ పీడ విరగడ కాలేదు కదా? దేశదేశాల నుంచీ స్పందన ఎలా ఉంటుంది? కొద్ది రోజులు ఆగితే సంపూర్ణంగా తెలుస్తుంది. ఇప్పటికైతే కాన్స్ ఫెస్టివల్ కోసం వేలాది మంది తరలి వస్తున్నారనే నిర్వాహకులు అంటున్నారు. అదే సమయంలో ఇండియాతో సహా మలేషియా, ఇండోనేషియా, వియత్నాం లాంటి దేశాల నుంచీ పెద్దగా రాకపోకలు ఉండకపోవచ్చట. ఎందుకంటే, ఆసియా ఖండంలో కరోనా మహమ్మారి గండం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. డెల్టా వేరియంట్ యూరప్, అమెరికాల్ని కూడా వణికిస్తూనే ఉంది. ఆసియాలోనైతే థియేటర్లు తెరుచుకోని ప్రాంతాలు చాలానే ఉన్నాయి…

కాన్స్ ఉత్సవం ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏం చెప్పలేం అంటున్నారు అబ్జర్వర్స్. ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ముగిస్తేగానీ అంతర్జాతీయ సినిమా వాణిజ్యం ఎంత వరకూ పుంజుకుందో అర్థం అవుతుంది. కాన్స్ కళకళలాడితే రానున్న కాలంలో సినిమా కళ కూడా మరోమారు కోట్ల రూపాయాల కలెక్షన్లు కురిపిస్తుంది!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-