నిర్మాతలను ఎగ్జిబిటర్స్ నియంత్రించగలరా!?

‘అక్టోబర్ వరకూ ఓటీటీల్లో మీ సినిమాలను విడుదల చేయకండి. ఆ తర్వాత కూడా పరిస్థితులలో మార్పు రాకుంటే అప్పుడు నిర్ణయం తీసుకోండి’ అని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం తాజాగా చేసిన తీర్మానం చిత్రసీమలో ఓ కొత్త చర్చకు తెరలేపింది. కరోనా కారణంగా సినీరంగం దెబ్బతిన్న మాట వాస్తవం. సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోవడంతో నిర్మాతలు ఎంత ఇబ్బంది పడ్డారో, థియేటర్ల మూసివేత కారణంగా ఎగ్జిబిటర్స్ సైతం అంతే ఇబ్బంది పడ్డారు. సెకండ్ వేవ్ తీవ్రత తగ్గి తిరిగి షూటింగ్స్ మొదలు కావడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. చక చకా తమ చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. కానీ ఎగ్జిబిటర్స్ మాత్రం ప్రభుత్వంతో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరక్క, థియేటర్లను తెరవడానికి ఇష్టపడటం లేదు. పార్కింగ్ ఫీజు వసూలుపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ పట్టుపడుతుంటే, టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో ఆంధ్ర ఎగ్జిబిటర్స్ పంతంతో ఉన్నారు. ఇక రెండు చోట్ల కరెంట్ ఛార్జీల ఇష్యూ ఉండనే ఉంది. గత నెల 20 నుండి థియేటర్లును నూరు శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకోమని తెలంగాణ ప్రభుత్వం చెప్పినా ఎగ్జిబిటర్స్ ఆ ఆదేశాలను పెడచెవిన పెట్టారు. ఇప్పుడు ఆంధ్రలోనూ అదే జరుగుతోంది. ఇవాళ్టి నుండి సినిమా థియేటర్లు (యాభై శాతం ఆక్యుపెన్సీతో, రోజుకు మూడు ఆటల చొప్పున) తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఎగ్జిబిటర్స్ ససేమిరా అంటున్నారు. పెద్ద చిత్రాలు విడుదల కానంత వరకూ, థియేటర్ల టిక్కెట్లు పెంచనంత వరకూ తెరిచేదే లేదని చెబుతున్నారు. నిజానికి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని ఎగ్జిబిటర్స్ పంచాయితీ ప్రభుత్వాలతో! కానీ ఈ గొడవలో నిర్మాతల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరి అయిపోయింది.

Read Also : వేణు శ్రీరామ్ కు ఫ్రీహ్యాండ్ ఇచ్చిన దిల్ రాజు!

గత యేడాది సెప్టెంబర్ తర్వాత అన్ లాక్ ప్రక్రియలో భాగంగా థియేటర్లు తీసుకోమని ప్రభుత్వం చెప్పినా కూడా… విడుదలకు పెద్ద సినిమాలు లేనప్పుడు తెరిచి ఉపయోగం ఏమిటని ఎగ్జిబిటర్స్ మీనమేషాలు లెక్కపెట్టారు. ఈ యేడాది పలువురు నిర్మాతలు మూడు నెలలుగా ఓటీటీలలో కాకుండా తమ చిత్రాలను థియేటర్లు ఎప్పుడు తెరిస్తే అప్పుడు అందులోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ థియేటర్లను ఓపెన్ చేస్తే… విడుదల చేయడానికి మీడియం బడ్జెట్ చిత్రాలు ఆరేడు సిద్ధంగా ఉన్నాయి. నాని, నాగ చైతన్య, అఖిల్, గోపీచంద్, రవితేజ వంటి హీరోల సినిమాలు థియేటర్ల ఓపెనింగ్ కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ ఇప్పుడేమో ఎగ్జిబిటర్స్ థియేటర్లు తీయకుండా… నిర్మాతలను మరో మూడు నాలుగు నెలలు వేచి ఉండమని కోరుతున్నారు. చిత్రం ఏమంటే… ఆ తర్వాత కూడా థియేటర్లు తీస్తారనే గ్యారంటీ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఒక వేళ కరోనా థర్డ్ వేవ్ వస్తే… అప్పటికి తగ్గుతుందో లేదో తెలియదు కాబట్టి.

Read Also : ముంబైలో రామ్ చరణ్ బీచ్ సైడ్ హౌజ్… గృహ ప్రవేశం కూడా…!!?

సో… ఇప్పటికే నాలుగు నెలలుగా తమ చిత్రాలను ఓటీటీలకు ఇవ్వకుండా ఆగిన నిర్మాతలు ఇప్పుడు మరో నాలుగు నెలలు ఎగ్జిబిటర్స్ మాటలకు విలువ ఇచ్చి, వేచి చూస్తారా అనేది అనుమానమే. అయితే… తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాతల్లో కొందరు ఎగ్జిబిటర్స్ కూడా కావడంతో వారు సంయమనంతో వ్యహరిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఎగ్జిబిటర్స్ థియేటర్లు తెరవకుండా ఇదే వైఖరిని మరో నెలరోజులు కొనసాగిస్తే మాత్రం… ఓటీటీకే నిర్మాతలు సై అనే ఆస్కారం ఉంది. తాజాగా కొందరు నిర్మాతలు జూలై మాసంలో తమ చిత్రాలను థియేటర్లలో ప్రదర్శిస్తామని చెబుతున్నారు. తాజాగా ఇవాళే ‘తిమ్మరుసు’ నిర్మాత ఆ తరహా ప్రకటన ఒకటి ఇచ్చారు. ఒకవేళ ఈ నెలలో థియేటర్లను తెరవకపోతే… తప్పనిసరి పరిస్థితిలో ఓటీటీకి వెళ్ళామని చెప్పుకునే ఆస్కారం వారికి ఉంటుంది. ఇదే కారణం రేపు ‘నారప్ప, దృశ్యం -2, విరాట పర్వం’ చిత్రాల నిర్మాత సురేశ్ బాబు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన్ని చూసి మరి కొందరు నిర్మాతలూ ఓటీటీ బాట పట్టొచ్చు. కాబట్టి ఎగ్జిబిటర్స్ ప్రభుత్వ పెద్దలను కలిసి, తమ సమస్యలకు సత్వర పరిష్కారం వెతుక్కోకుండా… నిర్మాతలపై ఎంత ఒత్తిడి చేసినా ఉపయోగం ఉండదు. ఓటీటీ అనే ప్రత్యామ్నాయం లేకపోతే నిర్మాతలు… ఎగ్జిబిటర్స్ మాటలను నయానో భయానో విని వుండే వారేమో కానీ ఇప్పుడు అందుకు ఆస్కారం లేదు. ఇదిలా ఉంటే…. ‘చిత్ర నిర్మాణం, ప్రదర్శన అనేవి పరస్పర అవగాహనతో సాగాల్సినవని, కాబట్టి సినిమా పెద్దల చొరవతో అతి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంద’ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుడొకరు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-