కర్నూలు జిల్లా టీడీపీలో సొంత ఆఫీసుల రచ్చ..!

కర్నూలు జిల్లా టీడీపీలో ఎవరి దుకాణం వాళ్లదేనా? ఎమ్మిగనూరు.. ఆలూరులో సొంత పార్టీలోనే రచ్చ మొదలైందా? ఇప్పటికే ఇంఛార్జులు ఉన్న నియోజకవర్గాల్లో పక్క నేతలు వచ్చి చేరడం ఆసక్తిగా మారింది. కోట్ల వర్గం ఓ మాజీకి ఝలక్‌ ఇస్తే ఇంకో మాజీ.. కోట్ల కుటుంబానికే షాక్‌ ఇచ్చేలా ఆఫీస్ తెరిచారట.

ఎమ్మిగనూరులో కోట్ల మరో ఆఫీస్‌ తెరవడంతో కొత్త చర్చ..!

కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లో టీడీపీ వర్గపోరు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఎమ్మిగనూరులో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సొంతంగా టీడీపీ ఆఫీస్‌ ప్రారంభించారు. వాస్తవానికి ఎమ్మిగనూరులో టీడీపీ ఇంచార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు. అక్కడ టీడీపీ ఆఫీస్‌ ఉండగానే కోట్ల మరో ఆఫీస్‌ తెరవడం వర్గపోరుకు ఆజ్యం పోస్తోంది. పైగా కోట్ల ఆఫీస్‌ ఓపెనింగ్‌కు వెళ్లొద్దని జయనాగేశ్వర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు చెప్పారట. ఇంచార్జే ఫోన్‌లో చెప్పడంతో జయనాగేశ్వర్‌రెడ్డి కొంతమంది అనుచరులు కోట్ల ఆఫీస్‌ ఓపెనింగ్‌కు దూరంగా ఉన్నారట. మాజీ ఎమ్మల్యేతో విభేదించే ఇంకొంతమంది కోట్ల ఆఫీస్‌ ప్రారంభోత్సవానికి వెళ్లారట.

కోట్ల ఆఫీస్‌ ఓపెనింగ్‌తో ఇంఛార్జ్‌తో గ్యాప్‌ వచ్చిందా?

ఎమ్మిగనూరులో ఇప్పటికే టీడీపీ ఆఫీస్‌ ఉండగా మరో పార్టీ అఫీస్‌ ఎందుకని జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి కూడా కోట్లకు ఫోన్‌ చేశారట. గతంలో కూడా తనకు ఎమ్మిగనూరులో ఆఫీస్‌ ఉందని.. తానెవరికి పోటీ కాదని కోట్ల చెప్పారట. ఇంచార్జ్‌ జయనాగేశ్వర్‌రెడ్డిని సైతం ఆఫీస్‌ ఓపెనింగ్‌కు ఎన్నిసార్లు ఆహ్వానించినా రాలేదని క్లారిటీ ఇచ్చారట. కోట్ల .. జయనాగేశ్వర్ రెడ్డిల మధ్య స్నేహము.. వైరము రెండూ లేవు. కాకపోతే తాజా ఎపిసోడ్‌ ఇద్దరి మధ్య గ్యాప్‌ తీసుకొచ్చిందట. ఎమ్మిగనూరు టీడీపీ శ్రేణులు ఎటువైవు వెళ్లాలో అర్థంకాక తల పట్టుకుంటున్నాయట.

ఆలూరులో కోట్ల సుజాత వర్సెస్‌ వీరభద్రగౌడ్‌..!

ఆలూరులో టీడీపీ నియోజకవర్గ మాజీ ఇంచార్జి వీరభద్రగౌడ్ వ్యక్తిగత ఆఫీస్ ఓపెన్‌ చేయడం కూడా చర్చగా మారింది. ఎమ్మిగనూరులో కోట్ల ఆఫీస్ ఓపెన్ చేసిన మరుసటి రోజే ఆలూరులో వీరభద్రగౌడ్ ఈ చర్యకు పాల్పడ్డారు. వాస్తవానికి ఆలూరు టీడీపీ ఇంచార్జ్‌ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత. వీళ్లిద్దరికీ ఇప్పటికే విభేదాలు ఉన్నాయి. అందుకే వీరభద్రగౌడ్ తీరుపై చర్చ మొదలైంది. కోట్ల సుజాతకు పోటీగానే వీరభద్రగౌడ్ ఆఫీస్ ఓపెన్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరభద్ర గౌడ్ ఆఫీస్‌కు టీడీపీ జెండా కట్టలేదు. తన వ్యాపార కార్యకలాపాల కోసం మాత్రమే ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నానని.. రాజకీయాలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారట వీరభద్రగౌడ్.

సొంత దుకాణాలపై టీడీపీలో చర్చ..!

ఈ సొంత దుకాణాలపై పార్టీలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఎమ్మిగనూరులో పాగా వేసేందుకే కోట్ల ఆఫీస్‌ ఓపెన్‌ చేశారని కొందరు.. కోట్ల సుజాతకు పోటీగా టికెట్‌ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకే అని వీరభద్రగౌడ్‌పై ప్రచారం మొదలైంది. ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావడానికే వీరభద్రగౌడ్‌ ఈ ఎత్తుగడ వేసినట్టు టాక్‌. మరి.. ఈ వర్గపోరు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Related Articles

Latest Articles