పదేళ్ళ ‘బిజినెస్ మేన్’

మహేశ్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘పోకిరి’ అరుదైన రికార్డులు నమోదు చేసింది. 2006లో ఆల్ టైమ్ హిట్ గా నిలచిన ‘పోకిరి’ వచ్చాక దాదాపు ఆరేళ్ళకు మళ్ళీ మహేశ్, పూరి కాంబోలో ‘బిజినెస్ మేన్’ రూపొందింది. ‘పోకిరి’ కాంబినేషన్ రిపీట్ కావడంతో ‘బిజినెస్ మేన్’కు మొదటి నుంచీ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే 2012 జనవరి 13న విడుదలైన ‘బిజినెస్ మేన్’ మంచి వసూళ్ళు రాబట్టింది.

‘బిజినెస్ మేన్’ కథ విషయానికి వస్తే- ఓ యువకుడు ఒంటరిగా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి వెళ్ళి అక్కడి చీకటిదందాలోనే వేలు పెట్టి, నేర చరిత గలవారిని ఎలా హడలెత్తించాడు అన్నదే ప్రధానాంశం. ముంబయ్ లోని ధారవి ప్రాంతంలోని పేదవారిని మోసం చేసి, వారి స్థలాలను కొట్టేయాలని కొందరు ప్రయత్నిస్తారు. దానిని విజయ్ సూర్య అడ్డుకొని, వారి పట్టాలు వారికే దక్కేలా చేస్తాడు. దాంతో అందరిలోనూ హీరో అయిపోతాడు. అదే సమయంలో ముంబై పోలీస్ కమీషనర్ అజయ్ భరద్వాజ్ నేరస్థులను ఏరిపారేసే కార్యక్రమం చేపట్టి ఉంటాడు. అజయ్ కూతురు చిత్రను తన చాతుర్యంతో ప్రేమలోకి దించుతాడు విజయ్. కూతురుకు విజయ్ ఓ నీచుడని నిరూపిస్తాడు అజయ్ భరద్వాజ. కానీ, అసలైన నేరస్థులను ఏరిపారేయడంలో అతనే ఘటికుడని అజయ్ భావిస్తాడు. అతణ్ణి కొందరు మట్టుపెడతారు. చివరి క్షణాల్లో కూతురును, ముంబై నగరాన్ని నీవే కాపాడాలంటూ విజయ్ ను కోరతాడు అజయ్. నేరస్థులను, వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులను విజయ్ ఏరిపారేస్తాడు. విజయ్ అసలు ఉద్దేశం ఏమిటో తెలిసిన చిత్ర మళ్ళీ అతని ప్రేమను అంగీకరిస్తుంది. చివరలో విజయ్, “నీ కంటే ఇక్కడ ఎవడూ తోపు లేడు…” అంటూ యూత్ కు సందేశమివ్వడంతో కథ ముగుస్తుంది.

మహేశ్ బాబు, కాజల్ అగర్వాల్, నాజర్, ప్రకాశ్ రాజ్, సయాజీ షిండే, రాజా మురాద్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, ధర్మవరపు, భరత్ రెడ్డి, రాజీవ్ మెహతా, బండ్ల గణేశ్, ఆకాశ్, శ్వేతా భరద్వాజ్ నటించిన ఈ చిత్రంలో ఓ సీన్ లో క్యాబ్ డ్రైవర్ గా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కనిపిస్తారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చగా, భాస్కరభట్ల పాటలు రాశారు. “సారొస్తారొస్తారా…”, “పిల్లా చావ్…”, “చందమామా…”, “బ్యాడ్ బోయ్స్…”, “ఆమ్చీ ముంబై..” అంటూ సాగే పాటలు అలరించాయి. 2012లో విడుదలైన సంక్రాంతి చిత్రాలలో ‘బిజినెస్ మేన్’ విజేతగా నిలచింది.

Related Articles

Latest Articles