పేరు మారినా.. ఫేట్‌ మారలేదు..! యడ్డీకి జులై గండం..!

యడియురప్ప.. కర్నాటకలో బీజేపీకి బలమైన నాయకుడు..! లింగాయత్‌ వర్గానికి చెందిన యడియురప్ప.. బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగారు. పార్టీ నుంచి బయటికి వచ్చినా.. ఆయన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి యడియురప్పకు జులై నెల అంటే టెన్షన్‌ పట్టుకుంటోంది. ఆయన రెండుసార్లు ఇదే నెలలో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో యడియురప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఆ పదవిలో ఎక్కువ సమయం ఉండలేకపోయారు. మూడేళ్లకే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంటే 2011 జులై 31న తన పదవికి రాజీనామా చేశారు. హైకమాండ్‌ ఆదేశాలతో తప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది యడియురప్పకు..! అయితే సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ ఆ సీన్‌ రిపీటైంది. ఆపరేషన్‌ కమల్‌ పేరుతో వ్యూహాలకు పదును పెట్టిన యడియురప్ప.. కాంగ్రెస్‌-జేడీఎస్‌ సర్కార్‌ను కూల్చడంలో.. బీజేపీని తిరిగి అధికారం కట్టబెట్టడంలో కీలక వ్యవహారించారు. 2019లో సీఎంగా మళ్లీ ప్రమాణస్వీకారం చేశారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత మళ్లీ సీన్‌ మొదటికి వచ్చింది. 2021 జులై 26న హైకమాండ్‌ ఆదేశాలతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఈ రెండు సందర్భాలు జులై నెలలో జరిగాయి. రెండు సార్లు హైకమాండ్‌ ఒత్తిడితోనే ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో యడియురప్పకు జులై నెల కలిసి రాలేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇదే కాదు.. కలిసివచ్చే కాలం కోసం గతంలో ఆయన తన పేరును మార్చుకున్నారు. పేరు మారినా.. యడియురప్ప ఫేట్‌ మాత్రం మారలేదు. ఆయన నాలుగుసార్లు సీఎం పగ్గాలు చేపట్టినా.. ఏనాడు ఐదేళ్ల పాటు కూర్చీలో కూర్చోలేకపోయారు. మొదటిసారి ఏడు రోజులు.. రెండోసారి మూడేళ్లు.. మూడోసారి కేవలం రెండంటే.. రెండే రోజులు ఆయన సీఎం పదవిలో ఉన్నారు. అయితే నాలుగోసారి కథ మారుతుందని భావించినా.. ఏజ్‌ బార్‌ అయిందంటూ హైకమాండ్‌ తప్పుకోమని చెప్పింది. దీంతో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన రోజే.. సీఎం పదవికి రాజీనామా చేశారు. మొత్తంగా కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన యడ్డీకి.. కాలం మాత్రం కలిసి రావడం లేదు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-