ప్లే బోయ్లా సాగుతున్న ర‌ణ‌బీర్ క‌పూర్

(సెప్టెంబ‌ర్ 28న ర‌ణ‌బీర్ క‌పూర్ బ‌ర్త్ డే)
బాలీవుడ్ న‌వ‌త‌రం క‌థానాయ‌కుల్లో ర‌ణ‌బీర్ క‌పూర్ తీరే వేరు. ప్లే బోయ్ ఇమేజ్ తో ప‌లువురు అమ్మాయిల‌తో ర‌ణ‌బీర్ సాగించిన ప్రేమాయ‌ణాల‌ను గురించి ముంబైలో ప‌లు క‌థ‌లు వినిపిస్తూ ఉంటాయి. అలాగ‌ని కేవ‌లం భోగ‌లాల‌సుడేమీ కాదు, న‌ట‌న‌లోనూ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నారు ర‌ణ‌బీర్. క‌పూర్ వంశంలో నాలుగో త‌రం హీరోగా విజ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తున్నాడు ర‌ణ‌బీర్ క‌పూర్. తండ్రి రిషి క‌పూర్, తాత రాజ్ క‌పూర్, ముత్తాత పృథ్వీరాజ్ క‌పూర్ వార‌స‌త్వాన్ని నిలుపుతూ వైవిధ్యం ప్ర‌ద‌ర్శిస్తున్నాడు ర‌ణ‌బీర్. త‌ల్లి నీతూ సింగ్ కూడా ఓ నాటి మేటి న‌టి. అలా ర‌ణ‌బీర్ లో ఎలా చూసినా న‌ట‌న న‌ర్త‌నం చేస్తూనే ఉంది.

ర‌ణ‌బీర్ తండ్రి రిషిక‌పూర్ బాల‌న‌టునిగానే భ‌ళా అనిపించారు. అదే తీరున ర‌ణ‌బీర్ లోనూ చిన్న‌ప్ప‌టి నుంచీ న‌ట‌న‌పై అభిలాష మెండుగానే ఉంది. అభిన‌యంపై ఆస‌క్తితోనే అమెరికా వెళ్ళి అక్క‌డ న్యూయార్క్ లోని స్కూల్ ఆఫ్ విజువ‌ల్ ఆర్ట్స్, లీ స్ట్రాస్ బెర్గ్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్లోనూ న‌ట‌న‌,ద‌ర్శ‌క‌త్వం విభాగాల్లో శిక్ష‌ణ పొందాడు ర‌ణ‌బీర్. స్వ‌దేశం వ‌చ్చిన త‌రువాత సంజ‌య్ లీలా భ‌న్సాలీ రూపొందించిన బ్లాక్ చిత్రానికి అసోసియేట్ గా ప‌నిచేశాడు. ఆ త‌రువాత అదే భ‌న్సాలీ తెర‌కెక్కించిన సావ‌రియా చిత్రంతో హీరో అయ్యాడు ర‌ణ‌బీర్. త‌రువాత త‌న స‌ర‌స‌న హీరోయిన్లుగా న‌టించిన దీపికా ప‌దుకొణే, క‌త్రినా కైఫ్ వంటివారితో ప్రేమాయ‌ణం సాగించాడు త‌న‌కంటే వ‌య‌సులో పెద్ద అయిన నాయిక‌ల‌తోనూ రొమాన్స్ చేశాడు. అలా ప్లేబోయ్ ఇమేజ్ తో సాగిన ర‌ణ‌బీర్ క‌పూర్ కు నిల‌క‌డ లేదు అనే పేరు ద‌క్కింది. అత‌నితో ప్రేమ‌వ్య‌వ‌హారం సాగించిన వారు వేరే దారి చూసుకున్నారు. ఇప్పుడు ర‌ణ‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్ తో ప్రేమ‌యాత్ర‌లు చేస్తున్నాడు.

ర‌ణ‌బీర్ క‌పూర్ కెరీర్ లో అజ‌బ్ ప్రేమ్ కీ గ‌జ‌బ్ క‌హానీ, రాజ్ నీతి, రాక్ స్టార్, బ‌ర్ఫీ, యే జ‌వానీ హై దివానీ, యే దిల్ హై ముస్కిల్, సంజు వంటి జ‌న‌రంజ‌క‌మైన చిత్రాలు ఉన్నాయి. బ‌ర్ఫీ, సంజు చిత్రాల‌లో ర‌ణ‌బీర్ న‌ట‌న చూసి ఫిదా అయిపోయిన వారెంద‌రో ఉన్నారు. ర‌ణ‌బీర్ క‌పూర్ త‌న ప్ర‌తి చిత్రంలో వైవిధ్యం కోసం త‌పిస్తున్నాడు. అందుకు త‌గ్గ‌ట్టుగానే పాత్ర‌ల ఎంపిక చేసుకుంటున్నాడు. షంషేరా చిత్రంలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేశాడు. మ‌న టాలీవుడ్ స్టార్ నాగార్జున‌తో క‌ల‌సి బ్ర‌హ్మాస్త్రలోనూ న‌టించాడు. ల‌వ్ రంజ‌న్ తెర‌కెక్కిస్తోన్న మ‌రో చిత్రంలోనూ ర‌ణ‌బీర్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రాల‌లోనూ వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో ర‌ణ‌బీర్ అల‌రిస్తాడ‌ని అభిమానులు ఆశిస్తున్నారు. అలియా భ‌ట్ తో స‌హ‌జీవ‌నం సాగిస్తోన్న ర‌ణ‌బీర్ ఆమె మెడ‌లో ఎప్పుడు మూడు ముళ్ళు వేస్తాడో చూడాల‌ని సినీజ‌నం ఆసక్తిగా చూస్తున్నారు. మ‌రి ఆ ఘ‌డియ ఎప్పుడు వ‌స్తుందో!?

-Advertisement-ప్లే బోయ్లా సాగుతున్న ర‌ణ‌బీర్ క‌పూర్

Related Articles

Latest Articles