కోనసీమలో రాజకీయం రోడ్డెక్కిందా…?

కోనసీమలో రాజకీయం రోడ్డెక్కిందా? రెండుపార్టీల క్రెడిట్‌ ఫైట్‌తో రహదారి మలుపులు తిరుగుతోందా? రోజూ ఈ మార్గంలో ప్రయాణిస్తూ.. నరకం చూస్తున్న ప్రజల వాదనేంటి? లెట్స్‌ వాచ్‌..!

వైసీపీ, బీజేపీ మధ్య నిప్పు రాజేస్తున్న కోనసీమ రోడ్డు..!

ఇది తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోకి ప్రవేశించే రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే ప్రధాన రహదారి. గోతులు పడి.. పూర్తిగా పాడవడంతో ఈ రోడ్డుపై ప్రయాణమంటే కోనసీమ వాసులు నరకం చూస్తున్నారు. అయితే రావులపాలెం పదహారో జాతీయ రహదారి నుంచి అమలాపురం 226 హైవేని కలుపుతూ కొత్త రోడ్డును కోనసీమకు మంజూరు చేసింది కేంద్రం. ఏపీ బీజేపీ నేతలు… ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా నాయకులు చెప్పినట్టుగా రహదారి నిర్మాణం జరగాలని ట్వీట్‌ చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అంతే అక్కడ నుంచి అధికార వైసీపీ.. బీజేపీ నేతల మధ్య ఈ రోడ్డు నిప్పు రాజేసింది.

మందపల్లి మీదుగా రోడ్డును ప్రతిపాదిస్తున్న బీజేపీ నేతలు..!
రావులపాడు నుంచి పలివెల మీదుగా రోడ్డు కోరుతున్న వైసీపీ నేతలు..!

రాజకీయ విభేదాలతో కొత్త రోడ్డు నిర్మాణం ముందుకెళ్లడం లేదు. అయినప్పటికీ రహదారి మంజూరుకు కారణం తామంటే తామని వైసీపీ, బీజేపీ నేతలు నోటికి పనిచెబుతున్నారు. ఈ గొడవతో కొత్త వివాదం తెరపైకి వచ్చి… మరిన్ని చిక్కుముళ్లు పడ్డాయి. రావులపాలెం నుంచి మందపల్లి మీదుగా కొత్తపేట నుంచి అమలాపురం వరకు ప్రస్తుతం ఉన్న మార్గంలోనే కొత్త రోడ్డు వేయాలని కోనసీమ బీజేపీ నేతలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ద్వారా కేంద్రమంత్రికి ఓ వినతిపత్రం అందజేశారు. ఈ ప్రతిపాదనకు వైసీపీ నేతలు ససేమిరా అంటున్నారట. రావులపాడు నుంచి వయా పలివెల మీదుగా అమలాపురం ప్రధాన కాల్వ పక్కగా కొత్త జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలన్నది వైసీపీ నేతల డిమాండ్‌.

స్థల సేకరణకు పొలాలు అడ్డంకిగా మారతాయా?

వైసీపీ, బీజేపీలు రెండు వేర్వేరు మార్గాలను నిర్దేశించడంతో ఏ రూటుకు గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందన్నది క్లారిటీ లేదు. రావులపాడు నుంచి పలివెలకు 10 కిలోమీటర్లు ఉంటే.. రావులపాలెం నుంచి కూడా అంతే దూరం ఉంది. కాకపోతే రహదారి నిర్మాణానికి స్థల సేకరణకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. రావులపాడు నుంచి రోడ్డు నేరుగా ఉండటంతో స్థల సేకరణకు పొలాలు అడ్డంకి అవుతాయి. అదే రావులపాలెం నుంచి అయితే కొన్ని గ్రామాల్లో భవనాలు తొలగించాల్సి వస్తుంది. దాంతో సమస్యలు పెరుగుతాయనే వాదన ఉంది.

రావులపాడును బైపాస్‌ రోడ్డుగా మారిస్తే బెటర్‌?

రావులపాలెం రోడ్డే అందరికీ అనువైనదని.. దానిని విస్తరిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడుతుంటే.. బైపాస్‌ రోడ్డుగా రావులపాడు రహదారిని ఎంచుకుంటే బెటర్‌ అన్నది మరికొందరి వాదన. కానీ.. సమస్య ఎక్కడా తెగడం లేదు. రెండు పార్టీల మధ్య విమర్శలకు ముడి సరుకుగా మారిపోయింది. మరి.. ఈ రోడ్డెక్కిన రాజకీయానికి ఎప్పుడు ముగింపు పలుకుతారో చూడాలి.

Related Articles

Latest Articles