అడకత్తెరలో హస్తం.. డైలమాలో నేతలు

తెలంగాణలో ఆ రెండు పార్టీల పంచాయితీలో కాంగ్రెస్ సైడ్ అయిపోయిందా..? రాజకీయ చదరంగంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది ఎవరు..? ఆ రెండు పార్టీల వ్యూహంలో కాంగ్రెస్ పాత్ర ఏంటి?

బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్యే విమర్శలు.. కాంగ్రెస్‌ మౌనం..!
తెలంగాణ రాజకీయాలు ఒకింత ఆశ్చర్యంగా.. మరికొంత వ్యూహాత్మకంగా నడుస్తున్నాయి. గడిచిన రెండు నెలలుగా పొలిటికల్ వార్ బీజేపీ.. టీఆర్‌ఎస్‌ మధ్యే సాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు మొదలుకుని.. ఉద్యోగుల కేటాయింపు వరకు ఈ రెండు పార్టీల మధ్య గట్టిఫైటే జరుగుతోంది. ఈ రెండు అంశాలపై కాంగ్రెస్‌ కొట్లాడుతున్నా.. అధికారపార్టీ కేవలం.. బీజేపీ విమర్శలకే కౌంటర్లు వేస్తోంది. దీంతో చర్చల్లో.. ప్రజల అటెన్షన్‌లో బీజేపీ, టీఆర్ఎస్‌లే కనిపిస్తున్నాయి. ఇది గమనించిన కాంగ్రెస్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఆ రెండు పార్టీల వ్యూహం నుంచి బయట పడటం ఎలానో తేల్చుకోలేక తలపట్టుకున్నారట నాయకులు.

కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న అనుమానాలేంటి?
కొంత కాలంగా బీజేపీ…టీఆర్‌ఎస్‌ రెండూ సమన్వయంతోనే కాంగ్రెస్‌ పార్టీని సైడ్‌ చేస్తున్నాయని చర్చ జరుగుతోంది. పార్టీ నాయకులు అదే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే పనిలో పడ్డారట. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మొదలుకుని.. మాజీ చీఫ్ ఉత్తమ్ వరకు…కమలం, గులాబీ రెండూ మిత్రపక్షాలుగా చెబుతూ విరుచుకుపడుతున్నారు. అయితే కాంగ్రెస్‌, బీజేపీలే కుమ్మక్కయ్యాయని టీఆర్ఎస్‌ కూడా ఆరోపిస్తుండటంతో కేడర్‌కు ఏమీ అర్థం కావడం లేదట. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి కొన్ని అనుమానాలు ఉన్నాయట. తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీతోపాటు.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిల గ్రాఫ్‌ తగ్గించడం కోసమే ఆ రెండు పార్టీలు ఎత్తుగడ వేస్తున్నాయని సందేహిస్తున్నారు.

పొలిటికల్‌ వార్‌లో కాంగ్రెస్‌ను సైడ్‌ చేస్తున్నాయా?
తెలంగాణలో భవిషత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వ వ్యతిరేకత చీలేలా చేయడం ఒక వ్యూహంగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ.. కాంగ్రెస్ ఎంత చీల్చుకుంటే అంత బెటర్ అనే ఆలోచన టీఆర్‌ఎస్‌లో ఉందట. వ్యతిరేక ఓటు ఒక పార్టీకే వెళ్తే అది రాజకీయంగా ఇబ్బందనే కోణంలో విశ్లేషణలు బయటకొస్తున్నాయి. తెలంగాణలో బలం పెంచుకోవాలని బీజేపీ… అధికారంలోకి రావాలని కాంగ్రెస్ వ్యూహాలు అమలుచేసే పనిలో ఉన్నయి. కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా సభలు మొదలుకుని రచ్చబండ.. రైతుల సమస్యలపై ఏ ఉద్యమం చేపట్టినా బీజేపీ, టీఆర్ఎస్‌లు సైలెంట్‌గా ఉంటున్నాయి. ఆ విధంగా పొలిటికల్‌ వార్‌లో కాంగ్రెస్‌ను సైడ్‌ చేస్తున్నాయన్నది కొందరి డౌట్‌. టీఆర్‌ఎస్‌, బీజేపీలపై కాంగ్రెస్‌ విరుచుకుపడినా ఆ రెండుపార్టీల స్పందన లేదు.

సవాళ్లను అధిగమించడమే కాంగ్రెస్‌కు పరీక్ష..!
ఇది కాంగ్రెస్‌ను రాజకీయంగా ఇరకాట పెట్టే ఎత్తుగడా.. లేక భవిష్యత్‌ లో ఒకరికి ఒకరు చెక్‌ పెట్టుకుంటారా అన్నది అర్థం కావడం లేదట. ఈ సవాళ్లను అధిగమిస్తూ.. జనాల్లోకి వెళ్లడం కాంగ్రెస్‌ పార్టీకి సవాల్‌గా మారినట్టు గాంధీభవన్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి.. పొలిటికల్‌ వార్‌లో హస్తం అడకత్తెరలో పడుతుందో.. అడ్డంకులు అధిగమిస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles