ఏపీలో చవితి రాజకీయం : నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసనలు

ఏపీలో వినాయక చవితి వేడుకలపై ఆంక్షల వివాదం తీవ్ర రూపు దాల్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, సత్యకుమార్ అరెస్ట్‌పై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి.నేడు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలవద్ద బీజేపీ నేతలు ధర్నాలకు దిగనున్నారు. మరోవైపు.. వేడుకలకు ససేమిరా అంటున్నారు అధికారులు. ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలను..బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ అందుకునే గణనాధుని ఉత్సవాలకు అడ్డంకులా అంటూ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు.. ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నిర్ణయంపై పునారాలోచన చెయ్యాలని సీఎంకు లేఖ కూడా రాశారు. ఎన్నికలు, సీఎం సభలు, వైసీపీ మీటింగ్‌లకు లేని కరోనా వైరస్‌ ప్రభావం.. గణనాథుని ఉత్సవాలకే అడ్డొస్తుందా అని ప్రశ్నించారు. కర్నూలు రాజ్‌ విహార్ సెంటర్‌లో భారీ నిరసనలో భాగంగా సోమువీర్రాజు, సత్యకుమార్‌, విష్ణువర్ధన్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వినాయక చవితి సందర్భంగా పందిళ్లు వేసుకుని ఉత్సవాలు జరుపుకోవడానికి అనుమతించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సర్కార్ నిర్ణయానికి నిరసనగా.. నేడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలకు దిగనున్నారు. ఉదయం పదకొండు గంటల నుంచి ధర్నా కార్యక్రమాలు నిర్వహించి, మెమొరాండం ఇవ్వనున్నారు. సర్కార్ నిర్ణయం మారకుంటే, ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-