జనసేనను కాదని బీజేపీ బరిలో నిలుస్తుందా?

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఉప ఎన్నిక హీట్ పెంచింది. వైసీపీ ఎమ్మెల్యే మృతితో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ షూరు అయ్యింది. అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ నుంచి మృతిచెందిన ఎమ్మెల్యే భార్యకే అధిష్టానం టికెట్ కేటాయించింది. టీడీపీ సైతం తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక జనసేన సైతం బద్వేల్ లో బరిలో నిలుస్తుందని జోరుగా ప్రచారం సాగింది.

కొద్దిరోజులుగా ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ మారిపోయింది. ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మాటల తూటాలు పేలుస్తుండటంతో వైసీపీ నేతలు సైతం ఎదురుదాడికి దిగుతున్నారు. ఈక్రమంలోనే జనసేన-వైసీపీ నేతల మధ్య అగ్గిరాజుకుంది. ఒకరిపై ఒకరు భౌతికదాడులు, ప్రతివిమర్శలు దిగడంతో వార్ షూరు అయ్యింది. కాగా నిన్న జరిగిన రాజమండ్రి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు.

బద్వేల్ బై ఎలక్షన్ నుంచి జనసేన తప్పుకుంటుందని ప్రకటించారు. అధికార వైసీపీ మృతిచెందిన ఎమ్మెల్యే భార్యకే టిక్కెట్ కేటాయించిన నేపథ్యంలో జనసేన పోటీకి దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికను వైసీపీ ఏకగ్రీవం చేసేలా చూడాలన్నారు. దీంతో ఇక్కడ పోటీ హోరాహోరీగా సాగుతుందని అంతా భావించినా జనసేన తప్పుకోవడంతో అలాంటిదేమీ ఉండదని క్లారిటీ వచ్చేసింది. అయితే జనసేన తప్పుకున్నా ఇక్కడ పోటీ చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేసుకుంటోంది.

జనసేన మద్దతు బీజేపీ ఇక్కడ పోటీ చేయాలని భావిస్తున్నాయి. అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు బీజేపీకి ఇబ్బందికరంగా మారేలా కన్పిస్తున్నాయి. సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేన పోటీ నుంచి తప్పుకుంటుందని పవన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తన మిత్రపక్షమైన బీజేపీకి మద్దతు ఇవ్వకపోవచ్చనే టాక్ విన్పిస్తోంది. దీంతో వీరి బంధానికి బద్వేల్ ఉపఎన్నిక సాక్షిగా బీటలు వారే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటీకే ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.

తిరుపతి బై ఎలక్షన్ తర్వాత జనసేన, బీజేపీలు ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఎవరికీ వారు ఒంటిరిగానే ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. పవన్ ఇచ్చిన కార్యక్రమాలకు బీజేపీ నుంచి మద్దతు లభించడం లేదు. అలాగే పవన్ పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నా ఆపార్టీ పెద్దగా స్పందించడం లేదు. దీంతో ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు సాగడం కష్టమేననే ప్రచారం జరుగుతోంది.

తాజాగా జనసేన బద్వేల్ లో పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ కావడంతో ఇక్కడ బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే బీజేపీకి జనసేనాని మద్దతు ఇస్తారా? లేదా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో వీరి బంధానికి బద్వేల్ సాక్షిగా బీటలు వారే అవకాశం కన్పిస్తోంది. మొత్తానికి బద్వేల్ ఉప ఎన్నిక జనసేన-బీజేపీ మధ్య చిచ్చుపెట్టేలా కన్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

-Advertisement-జనసేనను కాదని బీజేపీ బరిలో నిలుస్తుందా?

Related Articles

Latest Articles