ప్రభుత్వ వైఫల్యం తో అకాల వర్షం పాలవుతున్న ధాన్యం….

దేశ ప్రజలంతా కరోనాతో వణికి పోతుంటే తెలంగాణ రైతు ఆ కరోనాతో సహవాసం చేస్తూ కల్లాలు, మార్కెట్లో వారాల తరబడి బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అన్నారు. ప్రభుత్వ రైతు ఆరుగాలం శ్రమించి పండించిన యాసంగి ధాన్యం అంతా వాన పాలు అవుతోందని ఆయన ఆరోపించారు. ప్రతి ఏటా ఇట్లాంటి సమస్యలే వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం మేల్కొనడం లేదని ఆయన మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తుండటంతో రైతులు వారాల తరబడి కల్లంలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. యాసంగి ధాన్యం కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ప్లాన్ సిద్ధం చేసుకోలేదని సంజయ్ అన్నారు. ఎంత ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనా వ్యవసాయ శాఖలో లేకపోవడం దారుణం అన్నారు. కనీసం సరపడ గన్నీ బ్యాగులు కూడా లేవని ఆయన చెప్పారు. ఈ సీజన్ లో అకాల వర్షాలు సర్వసాధారణం. కాని కల్లాల్లో సరిపడ టార్పాలిన్ లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. టార్పాలిన్లు లేకపోవడంతో రైతుల ధాన్యం అంతా వర్షానికి కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్.

మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లాలోని ఎల్ ఎం డీ కాలనీ, నగునూరు, చిగురుమామిడి కల్లాల్లో వర్షానికి ధాన్యం వాన నీటిలో కొట్టుకుపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంచిర్యాల జిల్లాలోని లక్షట్టిపేట, దండేపల్లిలో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోతే ఆ రైతుల ఏడుపులు ఈ సీఎంకు వినిపించలేదా అని సంజయ్ అడిగారు. కల్లంలో పోసిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడంతో కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేటకు చెందిన రైతు భూమయ్య ఏప్రీల్ 21 తేదీన గుండెపోటుతో చనిపోయాడు. ఆరుగాలం పడ్డ కష్టం ఒక్క వానతో తడిసిపోయిందన్న ఆవేదనతోనే ఆ రైతులు చనిపోయాడు. దుబ్బాక వ్యవసాయ మార్కెట్ లోనే ధాన్యం పోసీ, తూకం కాకపోవడంతో 3 రోజులుగా నిరీక్షిస్తున్న ధర్మాజిపేటకు చెందిన రైతు పరుశురాములు వడదెబ్బతో చనిపోయాడు. వెంటనే కాంటా చేసి ఆయనను ఇంటికి పంపిస్తే బతికేవాడు కదా. ఇట్లాంటి ఉదాహరణాలు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు.

భద్రాద్రి కొత్తగుడెం జిల్లా, నల్గొండ జిల్లా ఒక్కటేమిటి రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి ఉంది. సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అని సంజయ్ విమర్శించారు. ఇక తాలు పేరుతో రైతుల్ని నిలువు దోపిడి చేస్తుంటే వ్యవసాయ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఏఈఓ లు సర్టిఫై చేసినంక కూడా మిల్లర్లు కిలీల చొప్పున తాలును కట్ చేయడం అన్యాయం అన్నారాయన. యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 6,477 కోనుగోలు కేంద్రాలు పెట్టామని కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం 5 వేల కేంద్రాలు కూడా పెట్టలేదని గుర్తుచేశారు. వచ్చే మూడు రోజులు రాష్ట్రానికి వర్షసుచన ఉండటంతో ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. సరిపడ టార్పాలిన్లు, గన్నీబ్యాగులు సమకూర్చాలి. 24 గంటల పాటు కాంటాలు పెట్టి కల్లాల నుంచి ధాన్యాన్ని మిల్లులలకు చేరవేయాలని సంజయ్ సూచించారు.

-Advertisement-ప్రభుత్వ వైఫల్యం తో అకాల వర్షం పాలవుతున్న ధాన్యం....

Related Articles

Latest Articles