పాదయాత్రలో కేంద్ర మంత్రులు, నాయకులు పాల్గొంటారు: బండి సంజయ్

తెలంగాణ బీజేపీ పార్టీ పాదయాత్రతో ప్రజాక్షేత్రంలో ఉండాలని భావిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదివరకే ప్రకటించారు. కాగా నేడు మరోసారి బండి సంజయ్ అధ్యక్షతన ఈ విషయమై సమావేశం జరిగింది. ఆగస్టు 9 నుండి ప్రారంభమయ్యే పాదయాత్ర, హుజూరాబాద్ ఎన్నికలు ప్రధాన అంశాలుగా చర్చించారు. పాదయాత్ర లక్ష్యాలు, ఉద్దేశాలను బండి సంజయ్ వివరించారు.

ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక, నియంత, గడీల పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబపాలనలో ప్రజలు దోపిడీకి గురవుతున్నారని, సామాన్య ప్రజలు బతకలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా ఈ పాదయాత్ర ద్వారా ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీ పార్టీయే ప్రత్యామ్నాయం అనే భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు. బీజేపీ చేపడుతున్న పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించబోతున్నాయన్నారు. పాదయాత్రలో కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు సైతం పాల్గొంటారని బండి సంజయ్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమావేశానికి హాజరైన నేతలంతా అభినందించారు. బూత్ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరినీ ఈ పాదయాత్రలో భాగస్వాములను చేస్తామని బీజేపీ నేతలు పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రతిరోజు వేలాది మంది కార్యకర్తలు పాల్గొనేలా చేస్తామన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-