ఈటల కోసం ఓట్లు ప్రజలు ఫిక్సుడ్ డిపాజిట్ చేసారు…

బీజేపీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మధువని గార్డెన్ లో పురప్రముఖుల సమావేశం జరిగింది. దీనికి బీజేపీ రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. అందులో విద్యాసాగర్ రావు మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుస్తున్నారన్న టాక్ ఇప్పటికే వచ్చింది. హుజురాబాద్ గురించి తెలిసిన ప్రపంచంలోని అందరూ ఇదే మాట చెబుతున్నారు. ఈటల గెలిస్తే.. తెలంగాణ ప్రభుత్వం బీజేపీ పార్టీ చేతిలోకి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏర్పాటు చేయాల్సి ఉండేది. ఇప్పటికే ఆలస్యమైంది. అమిత్ షా, మోడీకి నేను ఎప్పుడూ చెబుతూ ఉండేది. అన్ని రాష్ట్రాల కంటే ముందు బీజేపీ పాలన తెలంగాణలో ఏర్పడాలని చెబుతూ ఉండేది అన్నారు.

ఇక ఈటల రాజేందర్ కు పొమ్మనలేక పొగపెట్టారు అన్న ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయి. ఆత్మగౌరవం చాలా ప్రధానమైనది. అందుకే ఈటల బయటకు వచ్చారు. అంబేద్కర్ ఆనాడే ఆత్మగౌరవ ప్రాముఖ్యతను గుర్తించారు. ఏ వ్యక్తి కూడా తన గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఇతరులకు కృతజ్ఞతగా ఉండరని.. రాజ్యాంగంలో అంబేద్కర్ రాసారు. ఎవరైనా రాహుల్ పార్టీలోకి పోతారా అని అడిగారు. బీజేపీ గొప్పతనం గురించి, మోడీ గురించి తెలుసుకుని ఈటల బీజేపీ లో చేరారు. ఇప్పుడు ఎన్నికల్లో పంచుతున్న మద్యం, సారాలో తప్ప.. తెలంగాణలోని అన్ని పథకాల్లో కేంద్రం డబ్బులున్నాయి. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలంటే మనం అందరం కలిసి మెలిసి ఉండాలి. టీఆర్ఎస్ పార్టీకంటే ముందు లెఫ్ట్ పార్టీలో ఉన్న తాను.. బీజేపీలోకి వస్తున్నట్లు ఈటల రాజేందర్ నాకు ఫోన్ చేస్తే… నీకు భయం అవసరం లేదు.. వెల్కం అని చెప్పాను. లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న ఈటలను మీరెందుకు చేర్చుకున్నారని.. నన్ను ఓ విలేఖరి అడిగారు. అన్ని ఐడియాలజీలకు బీజేపీలో చోటుందని చెప్పాను అని తెలిపారు.

ఇక ఈటల రాజేందర్ కోసం ఓట్లు ఇఫ్పటికే ప్రజలు ఫిక్సుడ్ డిపాజిట్ చేసారు అని చెప్పిన ఆయన జాయింట్ అకౌంట్లో ఉన్న మరికొన్ని ఓట్లను విడిపిస్తే ఈటల భారీ మెజార్టీతో గెలుస్తారు. ఈటల రాజేందర్ విజయం ద్వారా బీజేపీ అధికారం సాధించేందుకు బాట వేయాలి. ఈ విజయం ద్వారా నరేంద్ర మోడీకి మనం బలం చేకూర్చిన వాళ్లం అవుతాం. సెప్టెంబరు 17ను విస్మరించినారంటే.. వాళ్లకు తెలంగాణ స్పూర్తి లేనట్లే. తెలంగాణ పోరాట వీరుడ రాంజీ గోండ్ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఎందుకు పెట్టరు. వంటింట్లో ఉండాల్సిన గ్యాస్ సిలిండర్ ను పట్టుకుని రోడ్లపై తిప్పుతున్నారు. ధర ఎక్కువైతే మోడీని అడిగితే.. ఎందుకు పెరిగిందో చెబుతారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ ధరలు ఉంటాయి. కానీ 2014లో ఉన్న సిలిండర్లకంటే ఇప్పుడు రెట్టింపు మహిళలకు మోడీ ఇచ్చారనే విషయం ఎవరూ చెప్పడం లేదు. మిషన్ భగీరథ కాన్సెప్ట్ మంచిదే కానీ.. అది కూడా విఫలమైంది అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles