పాదయాత్రపై ఈటల ప్రకటన.. చాలా బాధగా ఉంది..

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌.. తాను ప్రాతినిథ్యం వహించిన హుజురాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్రకు పూనుకున్నారు.. అయితే, అస్వస్థకు గురైన ఆయన.. ఆస్పత్రిలో చేరారు.. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ పాదయాత్ర కొనసాగిస్తారా? రద్దు చేసుకుంటారా? వాయిదా వేస్తారా? అనే చర్చ మొదలైంది.. వీటికి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు ఈటల రాజేందర్.

12 రోజులుగా 222 కిలోమీటర్లకు పైగా ప్రజా దీవెన పాదయాత్ర జరిగిందని.. ఈ యాత్రలో ప్రతిక్షణం నా వెన్నంటి నిలిచిన ప్రతీ ఒక్కరికీ పాదాభివందనం అని తన ప్రకటనలో పేర్కొన్నారు ఈటల… ఇక, వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలా ఉన్నాయి.. కానీ, ఊహించని అస్వస్థత వల్ల ప్రజా దీవెన యాత్రని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉందన్నారు. ఆరోగ్యం సహకరించగానే ప్రజా దీవెన యాత్ర మళ్లీ పునర్‌ ప్రారంభం అవుతుందని.. ఆగిన చోటు నుండే అడుగులు మొదలవుతాయి.. కొండంత మీ దీవెనలతో త్వరలో ప్రజా దీవెన యాత్రతో వస్తాను అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ఈటల రాజేందర్. కాగా, శుక్రవారం పాదయాత్రలో అస్వస్థతకు గురైన ఈటలకు పరీక్షలు నిర్వహించని వైద్యులు.. హైదరాబాద్‌ తరలించాలని సూచించడం.. మొదట నిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఆ తర్వాత అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles

-Advertisement-