‘ఎంటయ్యా ఇదీ..!’ తెలుగు రాష్ట్రాలపై మోదీ ఆశలు వదులుకున్నట్లేనా?

బీజేపీ అంటే ఉత్తరాది పార్టీగా ముద్రపడింది. అందుకు తగ్గట్టుగానే ఆపార్టీ నేతల తీరు ఉంటుంది. ఉత్తరాది బలంతోనే ఆపార్టీ దేశంలో అధికారంలోకి వస్తోంది. ఇటీవల వరుసగా రెండుసార్లు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా దక్షిణాదిన బీజేపీ పాగా వేయలేక పోతుంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక కర్ణాటక మాత్రమే. మిగిలిన రాష్ట్రాల్లో ఆపార్టీకి ఏమాత్రం బలం లేదు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలోనూ బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు కన్పిస్తుంది. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ తహతహలాడుతోంది. ఈక్రమంలోనే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల కంటే కూడా ఉత్తరాది రాష్ట్రాలపైనే మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో బీజేపీ కొంత పుంజుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గతంలో ఎన్నడూ లేనివిధంగా నాలుగు ఎంపీ సీట్లు దక్కాయి. ఏపీలో మాత్రం ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో ఏపీలో కంటే తెలంగాణపైనే బీజేపీ అధిష్టానం ఎక్కువ ఫోకస్ పెట్టింది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటాన్ని స్థానిక బీజేపీ నేతలు అడ్వాంటేజ్ గా తీసుకొని టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అన్నట్లు రెచ్చిపోతున్నారు. దీంతో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న రీతిలో ప్రచారం జరిగింది. అయితే రాష్ట్రంలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తెలంగాణపై కూడా ఆశలు వదులుకున్నట్లే కన్పిస్తుంది.

ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడ ఆశలు వదులుకుందంటే ఒక అర్థం ఉంది. కానీ తెలంగాణపై మోదీ ఆశలు వదులుకోవడమే ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయమే దీనిని రుజువు చేస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ సర్కారు తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేటాయించింది. దీని కోసం అప్పట్లోనే కేంద్రం రూ.625కోట్లను కేటాయించింది. అయితే ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును ఉపసంహరించుకున్నట్లు మోదీ సర్కారు ఎక్కడా ప్రకటించలేదు. కానీ తెలంగాణలో ఏర్పాటు కావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ పనులను మహారాష్ట్రలోని లాతూర్లో చేస్తోంది.

తెలంగాణకు అప్పట్లో కేంద్రం కేటాయించిన రూ.625 కోట్లను మోదీ సర్కారు తాజాగా నిలిపి వేసింది. పైగా లాతూర్లో ఏర్పాటు చేస్తున్న కోచ్ ఫ్యాక్టరీ కోసం సుమారు రూ. 587కోట్లను ఖర్చు చేస్తోంది. దీంతో అక్కడ పనులు ఎంత స్పీడుగా జరుగుతున్నాయో అర్థమవుతోంది. మరోవైపు తెలంగాణలో మాత్రం ఎలాంటి పనులు చేపట్టక పోవడాన్ని చూస్తుంటే ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ అటకెక్కినట్లే కన్పిస్తుంది. దీంతో తెలంగాణకు బీజేపీ మొండిచేయి చూపినట్లు అర్థమవుతోంది. ప్రతీ విషయంలో సీఎం కేసీఆర్ ను కార్నర్ చేస్తూ వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రం చేస్తున్న పనికి ఎలాంటి సమాధానం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీకి నాలుగు సీట్లు వచ్చినా అది మోదీ వేవ్లో వచ్చినవే అని అధిష్టానం భావిస్తోంది. దీంతో బీజేపీ తెలంగాణ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుందనే టాక్ విన్పిస్తుంది.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను కూడా బీజేపీ తుంగలో తొక్కుతోంది. ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇప్పటికే బీజేపీ తేల్చేసింది. మరోవైపు ఏపీకి తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తోంది. పోలవరం పథకం అంచనా వ్యయంలో కోత విధిస్తూ అన్నివిధాలుగా రాష్ట్ర ప్రయోజనాలపై మోదీ సర్కార్ దెబ్బేస్తుంది. ఏపీలో బీజేపీకి ఒక్క సీటుకు వచ్చే అవకాశం లేనందునే బీజేపీ ఇలా వ్యవహరిస్తుందనే టాక్ ఉంది. తాజాగా తెలంగాణకు సైతం బీజేపీ మొండిచేయి చూపించడం చూస్తుంటే ఇక్కడ బీజేపీ ఆశలు వదులుకున్నట్లే కన్పిస్తోంది. బీజేపీకి తెలుగు రాష్ట్రాలపై నమ్మకం లేకే గతంలో మంజూరైన ప్రాజెక్టులను సైతం ఉత్తరాది రాష్ట్రాలకు తరలించుకు పోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-