బిగ్ బాస్ 5 ముందు బిగ్ ఛాలెంజ్

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఆరంభం అయింది. వరుసగా మూడవసారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ 5వ సీజన్ లో మొత్తం 19 మంది పోటీదారులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది బిగ్ బాస్ 5 ముందు పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఎదురు చూస్తున్నాయి. గత సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా అంతగా పరిచయం లేని ముఖాలే ఎక్కువగా హౌస్ లో ఎంట్రీ ఇవ్వటం గమనార్హం. ప్రారంభం రోజున దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన పరిచయ వేదికలో కొత్తదనం లేకపోవడం కొంత నిరుత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. అయితే పోటీదారుల పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేసినా ప్రేక్షకులలో ఉన్న ఆసక్తి పలువురిని టీవీలకు కట్టిపడేలా చేసింది. అది ఏ స్థాయిలో అనే దానిని బట్టి ప్రారంభ ఎపిసోడ్ రేటింగ్ ఆధారపడి ఉంటుంది.

గత సంవత్సరం హౌస్‌లో పరిచయం లేని ముఖాలు ఎంట్రీ ఇవ్వడంతో భారీ విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే కరోనాతో వేరే వినోదం ఏదీ లేకపోవడంతో క్రమేపీ బిగ్ బాస్ 4 ప్రేక్షకాదరణను పొందింది. అదే నమ్మకంతో నిర్వాహకులు ఈ ఏడాది కూడా అంతగా పరిచయం లేని వారినే నమ్ముకుని ముందుకు వెళుతున్నట్లు అనిపిస్తోంది. ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ చంద్ర,యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్ కి ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇక అనీ మాస్టర్, ఉమా, ప్రియ, సరయు, RJ కాజల్ వంటి వారు తమ తమ వృత్తులలో చురుకుగా ఉన్నప్పటికీ ప్రజలలో అంత ఫాలోయింగ్ లేదనే చెప్పాలి. లోబో, విశ్వ, సిరి, సన్నీ, నటరాజ్ మాస్టర్, మానస్, హమీదా, ప్రియాంక సింగ్, జెస్సీ, శ్వేత, లహరి అయితే దాదాపు 90% ప్రేక్షకులకు తెలియని ముఖాలే. ఈ కొత్త ముఖాలతో నిర్వాహకులు వీక్షకుల దృష్టిని ఏ మేరకు ఆకర్షించగలరనే అంశంపై బిగ్ బాస్ 5 సక్సెస్ ఆధారపడి ఉంది.

అంతే కాదు ప్రసారం అయ్యే సమయం భిన్నమైనదే అయినా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’, ‘మాస్టర్ చెఫ్’ వంటి ప్రోగ్రామ్స్ తో గట్టి పోటీ ఉంది. అంతే కాదు త్వరలో ఐపిఎల్ తో పాటు అక్టోబర్‌లో టి-20 ప్రపంచ కప్ ఉన్నాయి. ఇంత పోటీ మధ్య టిఆర్పీలు సాధించటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కంటెంట్ తో పాటు పోటీ చేస్తున్నవారు కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయవలసి ఉంటుంది. మరి ఈ సవాళ్ళను అధిగమించి బిగ్ బాస్ సీజన్ 5 ఏ మేరకు ప్రేక్షకాదరణ పొందుతుందో చూద్దాం.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-