బిగ్ బాస్ రాజ్యం రాజకుమారుడిగా రవి!

బిగ్ బాస్ సీజన్ 5 ఐదవ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జరిగిన ‘రాజ్యానికి ఒక్కడే రాజు’ టాస్క్ కు 31వ రోజు రాత్రి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే ఏ రాజకుమారుడి దగ్గర ఎన్ని నాణేలు ఉన్నాయనే లెక్కింపును మర్నాడుకు వాయిదా వేశాడు బిగ్ బాస్. ఇక 31వ తేదీ రాత్రి ఓ శుభపరిణామంతో ముగిసింది. అదే ప్రియాంక సింగ్ బర్త్ డే వేడుక! జండర్ ఛేంజ్ చేసుకున్న ప్రియాంక సింగ్ పట్ల కినుక వహించిన ఆమె తండ్రి మనసు మార్చుకున్నాడు. కూతురుకు బర్త్ డే విషెస్ ను వీడియో ద్వారా తెలిపాడు. ప్రియాంక సింగ్ తల్లి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి, ఇంటికి మనసారా ఆహ్వానించింది. ఊహించని ఈ ఆశీస్సులకు ప్రియాంక సింగ్ కన్నీటి పర్యంతమైంది. అందరూ కలిసి ప్రియాంకను ఓదార్చారు. ఆమె సోదరుడు చీర పంపగా, బిగ్ బాస్ ఇచ్చిన కేక్ ను అందరకూ కలిసి ప్రియాంకతో కట్ చేయించారు. సింగర్ శ్రీరామ్ ‘వకీల్ సాబ్’ మూవీలోని మగువ మగువా పాటతో శుభాకాంక్షలు అందించాడు. హౌస్ లోని మగవాళ్ళందరి కాళ్ళకు నమస్కారం చేసి ప్రియాంక ఆశీస్సులు తీసుకుంది. మానస్ కు మాత్రం కాళ్ళకు నమస్కారం పెడుతున్నట్టుగా జస్ట్ సరదాగా నటించింది. అంతే. ఆమె ఏం చేస్తుందా? అని అదే పనిగా చూసిన హౌస్ మేట్స్ అంతా వీళ్ళిద్దరిని చర్యలను ఎంజాయ్ చేశారు.

ధనంలో సన్నీ, ఆదరణలో రవి
32వ రోజు బిగ్ బాస్ ఏ రాజకుమారుడి దగ్గర ఎన్ని నాణాలు ఉన్నాయో లెక్కించే పనిని కెప్టెన్ శ్రీరామ్ కు ఇచ్చాడు. కాస్తంత వివాదాలు, అనుమానాల నడుమ ఈ నాణేల లెక్కింపు జరిగింది. దీనికి ముందు ఈ గట్టునుంటావా? ఆ గట్టునుంటావా అనే తరహాలో రాజకుమారులు ప్రజలను తమ వైపు రమ్మని కోరారు. కానీ చివరి నిమిషంలో ఎవరూ అటూ ఇటూ మారలేదు. మొత్తంగా నాణేలు అత్యధికంగా ఉన్న రాజకుమారుడు సన్ని అన్నాయడు. అయితే… ప్రజలు మాత్రం రవి పక్షానే ఎక్కువ ఉండటం జరిగింది. సన్నీ వైపు ఆరుగురు ఉంటే, రవి తరఫున ఏడుగురు నిలిచారు. దాంతో బిగ్ బాస్ నాణేలకు ప్రాధాన్యం ఇవ్వకుండా రవి టాస్క్ లో గెలిచినట్టు ప్రకటించాడు. బిగ్ బాస్ రాజ్యానికి రాజకుమారుడిగా ఎన్నికైన రవిని సభ్యులంతా కలిసి ఊరేగింపుగా తీసుకెళ్ళి, గార్డెన్ లోని సింహాసనం పై అధిష్టింప చేయమని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో విశ్వ తన భుజాలపై రవిని ఎత్తుకోగా, సన్నీ పూల రేకులను పైకి చల్లాడు. మిగిలిన వారి వెంట రాగా, రవి సింహాసనంపై కూర్చున్నాడు. ఆ రకంగా రవికి కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే అవకాశం బిగ్ బాస్ కల్పించాడు.

కెప్టెన్సీ రేస్ లోకి వచ్చిన ప్రియ!
బిగ్ బాస్ రాజ్యానికి రాజు అయిన రవికి బిగ్ బాస్ ఓ టఫ్ టాస్క్ ఇచ్చాడు. కెప్టెన్ గా పోటీ చేసే ముగ్గురు వ్యక్తుల పేర్లను తన టీమ్ నుండి ఎంపిక చేసి చెప్పమని కోరాడు. తన పక్షాన నిలిచి, తన విజయానికి కారకులైన ఏడుగురిలో రవి ఎవరిని ఎంపిక చేస్తాడనే అనుమానం ప్రతి ఒక్కరికీ వచ్చింది. అయితే యాని మాస్టర్ పట్ల ఉన్న గౌరవంతో ఆమెకు మద్దత్తుగా నిలుస్తానని గతంలోనే హామీ ఇచ్చినట్టు రవి చెప్పాడు. అలానే రెండో పేరుగా హమీదాకు మాట ఇచ్చానని అన్నాడు. ఇక మొదటివారం కెప్టెన్ అయిన విశ్వకు మరోసారి ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చినట్టు రవి తెలిపాడు. కానీ శ్వేత ఆ విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పటికే ఒకసారి కెప్టెన్ గా వ్యవహరించిన వ్యక్తికి తిరిగి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం సరికాదని చెప్పింది. దాంతో ఇతర టీమ్ సభ్యులతో చర్చించి యానీ మాస్టర్, హమీదా, శ్వేత పేర్లను బిగ్ బాస్ కెప్టెన్ కంటెస్టెంట్ కు రవి నామినేట్ చేశాడు. అక్కడే బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఓడిపోయిన రాజు దగ్గర ఉన్న మొత్తం నాణేలను గెలిచిన టీమ్ లీడర్ తీసేసుకుని, తన వారికి ఎన్నైనా ఇవ్వొచ్చునని చెప్పాడు. దాంతో సన్నీ టీమ్ ను ఆడించిన షణ్ముఖ్, సిరి, జెస్సీ, కాజల్ హతాశయులై హాల్ లోంచి లేచి బెడ్ రూమ్ కు వెళ్ళిపోయారు. దీనికి ముందు హమీద, ప్రియా మధ్య ఉన్న గ్యాప్ యానీ మాస్టర్ చొరవతో పూడిపోయింది. ఓ అక్కగా తనతో మనసులోని భావాలను నిస్సంకోచంగా చెప్పుకోవచ్చని ప్రియా అన్న తర్వాత హమీద ఆమెను హగ్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంది. ఒక్కోసమయంలో తాను ఒంటరి తనం ఫీల్ అవుతున్నానని తెలిపింది. ఇదిలా ఉంటే… ప్రియా కెప్టెన్ గా నిలబడే అర్హత లేకుండా బిగ్ బాస్ హౌస్ మేట్ ఒకరు మొదట్లోనే శిక్ష విధించారు. దాంతో అప్పటి నుండీ ఆమె కెప్టెన్సీ టాస్క్ కు దూరంగానే ఉంది. అయితే ఆ శిక్షను బిగ్ బాస్ ఈ వారం ఎత్తివేశాడు. రవి టీమ్ లో కెప్టెన్సీ టాస్క్ లో ఉన్న వారు ఎవరైనా పోటీ నుండి తప్పుకుంటే ప్రియాకు చోటు దక్కుతుందనే తిరకాసు పెట్టాడు. రవి తాను తప్పుకుంటానని చెప్పినా అంగీకరించని ప్రియా, చివరి నిమిషంలో హమీద తప్పుకుంటానని ఒత్తిడి చేయడంతో కాదనలేకపోయింది. ఆ రకంగా హమీద స్థానంలోకి ప్రియా వచ్చి చేరింది.

పది వేళ్ళు సరిపోవు సోదరా!
కెప్టెన్సీ కంటెస్టెంట్స్ గా ఉన్న నలుగురు యాని మాస్టర్, ప్రియా, రవి, శ్వేతకు బిగ్ బాస్ ‘పదివేళ్ళు సరిపోవు సోదరా’ అనే టాస్క్ ఇచ్చాడు. నలుగురి పేర్లతోనూ నాలుగు వాటర్ డ్రమ్ములను గార్డెన్ ఏరియాలో పెట్టారు. దానికి చుట్టూ కొన్ని హోల్స్ పెట్టి, సంచాలకుడిగా వ్యవహరిస్తున్న షణ్ముఖ్ ను బజర్ మోగినప్పుడల్లా ఆ నాలుగు డ్రమ్స్ కు చెందిన హోల్స్ కు అడ్డం ఉన్న రబ్బర్ బిట్స్ ను తొలగించమని ఆర్డర్ వేశాడు. టాస్క్ పూర్తయ్యే సరికీ ఎవరి డ్రమ్ములో నీళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళే కెప్టెన్! అయితే ఈ ఆటలోనూ రూల్స్ ను సరిగ అర్థం చేసుకోకుండా, కొందరు అతిక్రమించారు. ప్రియాంక సింగ్ అయితే, వాటర్ ట్యాంక్ నే కిందపడేసే ప్రయత్నం చేసింది. మొత్తానికి గురువారం రాత్రి ప్రసారాలు పూర్తి చేసే సమయానికి కెప్టెన్సీ టాస్క్ లో విజేత ఎవరు అనేది తేలలేదు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ప్రియా కెప్టెన్ గా నియమితురాలు కాబోతోందంటు ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలంటే రేపటి రాత్రి వరకూ వేచి ఉండాల్సిందే!

-Advertisement-బిగ్ బాస్ రాజ్యం రాజకుమారుడిగా రవి!

Related Articles

Latest Articles