బిగ్ బాస్‌ ‘రాజ్యానికి ఒక్కడే రాజు’!

బిగ్ బాస్ సీజన్ 5, అక్టోబర్ 5 నాటి ప్రసారాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 29వ రోజు రాత్రికి సంబంధించిన కొన్ని సంఘటనలను మంగళవారం రాత్రి తొలుత ప్రసారం చేశారు. జెస్సీ మీద కోపంతో శ్రీరామ్ ఎవరి వంట వారే చేసుకోవాలని ఆవేశంగా అన్న మాటలతో చెలరేగిన చిచ్చు ఆ రాత్రి అటు షణ్ముఖ్, జెస్సీ, సిరి – ఇటు కెప్టెన్ శ్రీరామ్, హమీద డిన్నర్ చేయకుండానే పడుకునేలా చేసింది. ఇద్దరు ముగ్గురు జెస్సీ టీమ్ ను డిన్నర్ చేయమని కోరినా, వాళ్ళు సున్నితంగా తిరస్కరించడంతో మిగిలిన వాళ్ళు మాత్రం తినేసి పడుకున్నారు. అయితే… ఈ వివాదాన్ని తెగే వరకూ లాగకూడదని, మర్నాడు ఉదయానికి వదిలేద్దామని సిరి, జెస్సీ, షణ్ణులకు సలహా ఇచ్చింది. దాంతో 30 రోజు ఉదయం అందరూ ఏం జరగనట్టే ప్రవర్తించడం మొదలెట్టారు.

అమ్మకోసం బహుమతులు
బిగ్ బాస్ షోను స్పాన్సర్ చేస్తున్న సంస్థలు తమ ప్రొడక్ట్స్ కు సంబంధించిన ప్రచారాన్ని బాగానే చేసుకుంటున్నాయి. అందులో భాగంగా అమెజాన్ సంస్థ కూడా ప్రస్తుతం అమలులో ఉన్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ గురించి వ్యూవర్స్ కు తెలియచెప్పింది. గార్డెన్ ఏరియాలో నాలుగు స్టాండీస్ ను ఏర్పాటు చేసి, నలుగురు కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసి వాటిపై ఉన్న పరదాలు తొలగించమని కాజల్ ద్వారా చెప్పింది. కంటెస్టెంట్స్ లో నలుగురిని ఎంపిక చేసుకునే హక్కు కెప్టెన్ గా శ్రీరామ్ కు బిగ్ బాస్ అప్పగించాడు. దాంతో ప్రియ, మానస్, షణ్ముఖ్‌, హమీదాలను అతను ఎంపిక చేశాడు. ప్రియా స్టాండీపై పరదా తొలగించగానే ఆమెకు టీవీ బహుమతిగా వచ్చింది. దానిని తన తల్లికి కానుకగా ఇస్తానని ప్రియా తెలిపింది. ఆ తర్వాత హై ఎండ్‌ కంప్యూటర్ షణ్ముఖ్ కు రావడంతో, తనతో వెబ్ సీరిస్ తీసిన దర్శకుడు సుబ్బుకు దానిని ప్రెజెంట్ చేస్తానని అతను చెప్పాడు. ఇక హమీద తనకు వచ్చిన లేటెస్ట్ మొబైల్ ఫోన్ ను తన తల్లికి ఇస్తానని తెలిపింది. కార్లు, వాచెస్ అంటే తనకు, తన తల్లికి ఎంతో ఇష్టమని, తనకొచ్చిన రిస్ట్ వాచ్ ను మదర్ కు ప్రెజెంట్ చేస్తానని మానస్ చెప్పాడు.

బిగ్ బాస్ లో పెద్దాయన!
ఇక 30వ రోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్ కు ముందు సందడ్లో సడేమియాలా కాజల్, లోబో, రవి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగింది. నెల రోజుల పాటు బాత్ రూమ్ పనులకే పరిమితమైన రవి, లోబో ఇకపైన వంట చేయాల్సి రావడంతో వారిని కాజల్ ఆటపట్టించింది. అది కాస్తంత శ్రుతి మించింది. దాంతో రవి తన అసహనం వ్యక్తం చేయగా, లోబో మాత్రం తెలివిగా తన మిడిల్‌ ఫింగర్ ను క్యాజువల్ గా సీలింగ్ వైపు చూస్తున్నట్టుగా చూపించాడు. అతని భావాన్ని గ్రహించిన కాజల్… అలా ఎందుకు చూపించావ్ అంటూ లోబోను క్వశ్చన్ చేసింది. అలాంటిదేమీ లేదని, తను సీలింగ్ వైపు వేలు చూపించానని లోబో మాట మార్చాడు. ఆ తర్వాత కూడా కాజల్ అదే విషయాన్ని మిగిలిన హౌస్ మేట్స్ దగ్గర ఎత్తగానే రవి ఆమెతో వాదనకు దిగాడు. తమని కాజల్ ప్రొవోక్ చేయడం వల్లే లోబో అలా రియాక్ట్ అయ్యాడని, ఎగతాళి చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందని, దాన్ని దాటితే ఇలాంటి ప్రతిస్పందనే వస్తుందని గట్టిగానే కాజల్ కు చెప్పాడు. దాంతో ఆమె కూడా రవి మీద ఆవేశపడింది. వీరిద్దరికీ సర్ధిచెప్పే ప్రయత్నం కెప్టెన్ గా శ్రీరామ్ చేయడం మొదలెట్టాడు. బిగ్ బాస్ హౌస్ లో జెస్సీ తప్ప మగవాళ్ళంతా తనను నామినేట్ చేయడంతో రగిలిపోతున్న షణ్ముఖ్… ‘తాను చేసిన తప్పులు సరిద్దుకోలేడు కానీ ఇతరులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు హౌస్ లోని పెద్దాయన’ అంటూ శ్రీరామ్ ను ఉద్దేశించి సెటైరిక్ గా మాట్లాడాడు. దానికి సహజంగానే సిరి, జెస్సీ వంత పాడారు. అయితే ఆ తర్వాత కొంత సేపటికి లోబో వచ్చిన కాజల్ కు సారీ చెప్పడం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. షణ్ణును అందరూ కలిసి టార్గెట్ చేయడంతో కొన్ని రోజులుగా సిరికి ఉద్దేశ్య పూర్వకంగా దూరంగా ఉంటూ వచ్చిన షణ్ణు తిరిగి ఆమెకు సన్నిహితమైపోయాడు. సిరి కోరుకునేది కూడా అదే కావడంతో ఆమె ఫుల్ హ్యాపీగా ఉంది. ఇటు సన్నీకి, అటు జెస్సీకి గోరుముద్దులు తినిపిస్తూ, ఆ ఇద్దరిని తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ సాధించింది.

రాజకుమారులుగా రవి – సన్నీ
5వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ మంగళవారం మొదలైంది. దానిపేరే ‘బిగ్ బాస్ రాజ్యానికి ఒక్కడే రాజు’. ఇందులో రవి, సన్నీలను బిగ్ బాస్ రాజకుమారులుగా నియమించాడు. మిగిలిన పార్టిసిపెంట్స్ అంతా ప్రజలు. వారిని తమవైపు తిప్పుకుని, వారి ఓట్లను రాజకుమారులు సంపాదించాల్సి ఉంటుంది. అందుకోసం హామీలు ఇవ్వడం, ఏదైనా పనిచేస్తే బిగ్ బాస్ ఇచ్చిన నాణేలను వారికి ఇవ్వడం చేయొచ్చు. అలానే సభ్యులు తమ అవసరాల కోసం, కోరికల కోసం రాజకుమారులను డబ్బులు డిమాండ్ చేయొచ్చు. ఆట పూర్తయ్యే సరికీ ఎవరికి ఎక్కువ మంది ప్రజల మద్దత్తు ఉంటుందో, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వారు గెలిచినట్టు. అయితే మన రాజకీయాలలో ఉన్నట్టుగా ఎక్కడ తమకు లబ్ది చేకూరుతుందో అక్కడికి సభ్యులు వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. దాంతో మొదట వ్యూహాత్మకంగా సన్నీకి మద్దత్తు పలికిన వారు కొందరు నిదానంగా రవివైపు చేరిపోయారు. రెండు చోట్ల డబ్బులు తీసుకుని, ఫైనల్ గా తన వైపు నిలవమంటూ సన్నీ కొందరిని కోరాడు. దాంతో శ్వేత, యాని వంటి వారు ప్లేట్‌ ఫిరాయించారు. చిత్రం ఏమంటే… ఏదో ఒక పనిచేసి, లేదా ప్రలోభ పెట్టి డబ్బులు తీసుకోవాల్సిన ప్రజలు కొందరు, ఎవరూ చూడటం లేదని నాణేలను దొంగిలించారు.

‘మట్టిలో మహాయుద్ధం’కు సర్వం సిద్ధం
కెప్టెన్సీ టాస్క్ లోనే భాగంగా రెండో రోజు ఆసక్తికరమైన ఆట జరుగబోతోంది. అదే ‘మట్టిలో మహా యుద్ధం’. గార్డెన్ ఏరియాలో వెస్లింగ్ పిట్ ను ఏర్పాటు చేసిన బిగ్ బాస్ ఇద్దరు రాజకుమారుల టీమ్ నుండి ముగ్గురేసి సభ్యులను పోటీకి దింపమని చెప్పాడు. మహిళలు మహిళలతోనే పోరాడాలని రవి చెప్పిన సలహాను సన్నీ తిరస్కరించాడు. తన దగ్గర మహిళలు తక్కువ ఉన్నారని, కాబట్టి తాను మగవాళ్ళనే బరిలోకి దించుతానని చెప్పాడు. అది అన్ ఫెయిర్ అని రవి చెప్పడంతో గతంలో కట్టెలు కొట్టే టాస్క్ సమయంలో రవి- విశ్వ… తమకు పోటీగా ప్రియా, ప్రియాంకలను ఎంపిక చేసుకోవడం అన్ ఫెయిర్ కాదా? అని సన్నీ ఎదురు దాడికి దిగాడు. అప్పుడు కరెక్ట్ అయ్యింది? ఇప్పుడు తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించాడు. తమ వైపు ఉన్న ఎవరైనా అమ్మాయిని వంద నాణేలకు కావాలంటే కొనుక్కోవచ్చని రవి ఇచ్చిన ఆఫర్ ను సన్నీ తిరస్కరించాడు. దాంతో బుధవారం ప్రసారం అయ్యే ‘మట్టిలో మహాయుద్ధం’ టాస్క్ లో రవి తరఫున విశ్వ, శ్వేత, యాని; సన్నీ తరఫున ప్రియాంక, మానస్, జెస్సీ బరిలోకి దిగబోతున్నారు. సో… బుధవారం ఎపిసోడ్ అంతా రచ్చరచ్చే!

-Advertisement-బిగ్ బాస్‌ 'రాజ్యానికి ఒక్కడే రాజు'!

Related Articles

Latest Articles