చైనాతోనే తాలిబన్లు: భారత్ కు గట్టి షాకిచ్చారు..!

అప్ఘన్లో రోజురోజుకు అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాలిబన్ల దెబ్బకు జడిసిన ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పలాయనం చిత్తగించాడు. దీంతో ఆ దేశంలో తాలిబన్లకు హద్దు అదుపు లేకుండా పోయింది. అక్కడి ప్రజలకు తాలిబన్ల పాలన ఇష్టం లేనప్పటికీ వారికి వారే గత్యంతరంలేని పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకున్న తాలిబన్లు ఆఫ్ఘన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. ఈక్రమంలోనే తాలిబన్లు తమ ప్రభుత్వ ఏజెండాను ప్రకటించారు. తమకు సంబంధించి మిత్రులెవరో.. శత్రువులెవరో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో భారత్ తో సహా ఉపఖండంలోని దేశాలన్నీ తమకు మిత్రులని ప్రకటించగా ఇప్పుడు మాటమార్చారు. చైనా-పాకిస్థాన్ మాత్రమే తమకు మిత్రదేశానికి ప్రకటించడం ద్వారా తాలిబన్లు భారత్ కు గట్టి షాకిచ్చినట్లయింది.

తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తమ అజెండా బయట పెట్టారు. ఆఫ్గన్లో పెట్టుబడులు పెట్టడానికి.. పునర్నిర్మించడానికి చైనా సిద్ధంగా ఉందని తెలిపారు. చైనా ద్వారా ప్రపంచ మార్కెట్లలోకి తమకు ప్రవేశ ద్వారం అందుతుందని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తమకు చైనా ప్రధాన భాగస్వామిగా ఉంటుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో చైనా దేశంలో పెట్టుబడి పెట్టడానికి.. పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్నందున ఈ అవకాశాన్ని తాము అందిపుచ్చుకుంటామని ముజాహిద్ వెల్లడించాడు. చైనా తలపెట్టిన పురాతన సిల్క్ రోడ్‌ని పునరుద్ధరించడానికి ఉపయోగపడే వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్‌ను తాము గౌరవిస్తామని చెప్పారు. తమ వద్ద గొప్ప రాగి గనులు ఉన్నాయని వీటిని చైనీయుల కోసం తిరిగి ఉత్పత్తిలోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.

అయితే భారత్ సహా ఉప ఖండంలోని ఏ ఇతర దేశాన్ని కూడా తాము దూరం చేసుకోబోమని చెబుతూ వస్తున్న తాలిబన్లు సడెన్ గా మాటమార్చడం భారత్ కు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతోంది. భారత్ ఇప్పటికే వేలకోట్ల రూపాయాల పెట్టుబడులను ఆప్ఘన్లో పెట్టింది. తాలిబన్లు కేవలం చైనా, పాకిస్థాన్ ను మాత్రమే మిత్రదేశంగా గుర్తించడంతో భారత్ కు ఇబ్బందులు వచ్చేలా కన్పిస్తున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మరితో ప్రపంచ నాశనానికి పూనుకున్న చైనా తాజాగా ఉగ్రవాదులకు ఆపన్న హస్తం ఇస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనా తీరుపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని కలలు కంటున్న చైనాకు భారత్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో తాలిబన్లను ఇప్పుడు ఓ పావుగా వాడుకుంటుందనే టాక్ విన్పిస్తోంది. తాలిబన్లతో స్నేహం చేస్తూ భారత్ ను దెబ్బతీయాలని చైనా భావిస్తున్నట్లు కన్పిస్తోంది.

ఏదిఏమైనా అఫ్ఘన్లో జరుగుతున్న పరిణామాలు రాబోయే రోజుల్లో భారత్ కు మరిన్ని ఇబ్బందులు తెచ్చేలా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లతో భారత్ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో తాలిబన్లను పెంచిపోషించిన అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంది.. ఇప్పుడు చైనా కూడా అదే బాటలో నడుస్తుండంలో వారికి కూడా అదే గతి పడుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-