పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఇంగ్లాండ్‌

వచ్చే నెల తమ జట్ల పాక్‌ పర్యటన ఆలోచన విరమించుకుంది ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు – ECB. అక్టోబర్‌ 13, 14 తేదీల్లో ఇంగ్లాండ్‌ పురుషుల జట్టు రావల్పిండిలో T-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. T-20 వరల్డ్‌ కప్‌కు ఇవి సన్నాహకాలుగా ఉపయోగపడతాయని భావించింది ECB. అలాగే, అక్టోబర్ 17, 19, 21 తేదీల్లో ఇంగ్లాండ్‌ మహిళల జట్టు వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ, ఇప్పుడు నిర్ధిష్టమైన ముప్పు పొంచి ఉందంటూ తమ జట్ల పాక్‌ టూర్‌ను రద్దు చేసింది ECB. ప్రస్తుత పరిస్థితులో తాము పాకిస్థాన్‌ టూర్‌కు వెళ్లడం సరికాదని భావిస్తున్నామని తెలిపింది ECB.

ఇటీవలే పాక్‌ టూర్‌కు వచ్చిన న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు… ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండా వెనుదిరిగింది. 18 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌ టూర్‌కు వచ్చిన న్యూజీలాండ్… రావల్పిండిలో 3 వన్డేలు, లాహోర్‌లో 5 T-20లు ఆడాల్సి ఉంది. అయితే, వాటిని రద్దు చేసుకుని స్వదేశానికి వెళ్లిపోయారు కివీస్‌ ఆటగాళ్లు. ఇప్పుడు ఇంగ్లాండ్‌ కూడా తమ జట్టు రావడం లేదని పాకిస్థాన్‌కు తేల్చి చెప్పింది.

దీంతో వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగాల్సిన పలు టోర్నీలపైనా ఈ ప్రభావం కనిపించే సూచనలున్నాయి. 2022లో ఆస్ట్రేలియాతో పాటు మరికొన్ని దేశాలకు ఆతిథ్యమివ్వాలని భావిస్తోంది పాకిస్థాన్‌. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ల నిర్ణయం పాక్‌కు శరాఘాతమే. తమ దేశానికి వచ్చే క్రికెట్ జట్లకు సంపూర్ణ భద్రత కల్పిస్తోంది పాకిస్థాన్‌. కానీ… అక్కడి వాస్తవిక పరిస్థితుల దృష్ట్యా పాక్‌ టూర్‌ అంటే భయపడుతున్నాయి ప్రపంచ దేశాలు. ఇంగ్లాండ్‌ నిర్ణయంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఆవేదన వ్యక్తం చేసింది.

-Advertisement-పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఇంగ్లాండ్‌

Related Articles

Latest Articles