కోవిడ్ ఎఫెక్ట్: మోడీపాలనపై ప్రభావమెంతో తేలనుంది ?

ఇన్నాళ్లు దేశంలో మోడీకి ఎదురేలేదు. కానీ కరోనా వచ్చాక పరిస్థితులు మారాయి. ప్రతిపక్షం కాంగ్రెస్ కుదేలైనా.. మోడీ పక్షాన్ని మాత్రం కరోనా చావుదెబ్బ తీసింది. కరోనా టైంలో ప్రజలను ఆదుకునే విషయంలో.. ప్యాకేజీలు ప్రకటించడంలో మోడీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కరోనా ఎఫెక్ట్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం.. కవర్ చేయడానికి మోడీ సార్ పెంచిన ధరాఘాతంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఈక్రమంలోనే ఎన్నడూ లేనంతగా మోడీ పాలనపై దేశ ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ ప్రభావం రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

త్వరలోనే దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలు మోదీ సర్కారు పనితీరుకు గిటురాయిగా నిలువబోతున్నాయా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. బీజేపీ సర్కారు వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మోదీ ప్రధాని అయ్యాక సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక భారత్ అన్నిరంగాల్లో వైఫల్యం చెందినట్లు కన్పిస్తోంది. ఇక కరోనా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చాక మోదీ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనుండటం మోదీకి అగ్ని పరీక్షగా మారబోతుంది.

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీ ఫైనల్ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగబోతున్న ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మెజార్టీ పక్షం బీజేపీనే అధికారంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కత్తీ మీద సాములా మారింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై మోదీ ప్రభావం ఖచ్చితంగా పడనుంది. దీంతో ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అంత ఈజీ కాదనే వాదనలు విన్పిస్తున్నాయి. వీటికి రాజకీయ విశ్లేషకులు అనేక కారణాలు చెబుతున్నారు.

మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత దాదాపు అన్ని రంగాల్లో విఫలమయ్యారన్నది వాస్తవం. ఇక కరోనా సమయంలో బీజేపీ సర్కారు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిచ్చింది. కరోనా కట్టడిలో.. వైద్య సాయం అందించడంలో..లాక్ డౌన్ లో పేదలకు సాయం ప్రకటించడంలో మోదీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పించిందన్న విమర్శలున్నాయి. దీనికితోడు ప్రభుత్వం కన్నా సామాజిక సంస్థలు, ప్రైవేటు వ్యక్తులే పేదలను లాక్ డౌన్లో ఆదుకున్నాయనే విమర్శలు కేంద్ర సర్కారుపై వచ్చాయి.

దీనికితోడు పెట్రోల్, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. పెట్రోల్, డిజీల్ రేట్లు వందకుపైగా పెరుగగా.. గ్యాస్ ధరలు వెయ్యికి చేరువయ్యాయి. ఈ ప్రభావం నిత్యావసర ధరలపై పడటంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. సామాన్యుడికి ధరాఘాతం మొదలైంది. కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష కోట్ల సాయం కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది. ఇవన్నీ కూడా మోదీ ఇమేజ్ ను దారుణంగా మసకబర్చాయి.

మోదీ తన పాలనలో దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు ప్రజల్లో చర్చకు దారితీశాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలను గాలికొదిలేశారని విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువ వస్తున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా మోదీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ ప్రభావం ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పడే అవకాశం కన్పిస్తోంది. ఇక్కడ గెలుపొటములకు మోదీనే బాధ్యత వహించాల్సి ఉండటంతో ఎన్నికల ఫలితం ఎలా వస్తుందనేది ఆసక్తిని రేపుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-