బెడిసి కొట్టిన బిగ్ బాస్ బొమ్మల తయారీ!

బిగ్ బాస్ సీజన్ 5లో రెండు రోజుల పాటు సాగిన బొమ్మల తయారీ టాస్క్ వ్యూవర్స్ సహనానికి పరీక్ష పెట్టింది. హౌస్ లోని సభ్యులకు రెండు రోజుల పాటు ఏదో ఒక పని చెప్పి కాలయాపన చేయడానికే బిగ్ బాస్ ఈ గేమ్ పెట్టారేమో అనిపిస్తోంది. 37వ రోజు, 38వ రోజు కూడా సాగిన ఈ ఆటకు ఫుల్ స్టాప్ మాత్రం పడలేదు. అయితే… అసలు కథ ఆ మర్నాడు ఉంటుందన్నట్టుగా బిగ్ బాస్ ఈ టాస్క్ లో రూల్స్ ను అతిక్రమించిన వారిని కెప్టెన్సీ పోటీ నుండి తొలగించ బోతున్నామంటూ పిడుగు లాంటి వార్త చెప్పడం కొసమెరుపు.

యాని మాస్టర్ కంట తడి!
37వ రోజు రాత్రి సంఘటనలతో బుధవారం బిగ్ బాస్ షో మొదలైంది. యాని మాస్టర్ తన అలసత్వాన్ని పక్కన పెట్టి, శ్వేత టీమ్ చేసిన బొమ్మలను లాక్కోవడానికి ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. యానీ మాస్టర్ ఇలా దూకుడుగా ప్రవర్తిస్తుందని ఆమె టీమ్ సభ్యులు సన్నీ, మానస్ సైతం ఊహించలేదు. అయితే… శ్వేత యాని చర్యలకు హర్ట్ అయ్యానని చెప్పడంతో ఆ సమాధానం ఊహించని యానీ మాస్టర్ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ముందు టాస్క్ లో ఫ్రెండ్ ను పోగొట్టుకున్న తాను, ఈ టాస్క్ లో బిడ్డను పోగొట్టుకున్నానంటూ గొల్లు మంది. అంతేకాదు… రాత్రి 1.30 వరకూ ఎంతమంది బతిమిలాడినా, డిన్నర్ చేయలేదు. అలానే అటు పక్క కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న శ్వేతను రవి ఓదార్చాడు. తమకొచ్చిన స్పెషల్ పవర్ విషయాన్ని శ్వేతతో చెప్పి, వర్రీ కావద్దంటూ ఓదార్చాడు. మానస్, సన్నీ ఒత్తిడితో డిన్నర్ చేయడానికి సిద్ధపడిన యానీ మాస్టర్… శ్వేత కూడా తిన్నదో లేదో తెలుసుకోవడానికి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. అప్పటికీ శ్వేత తినలేదని తెలిసి, తమ గొడవను కాస్తంత ప్యాచప్ చేసే ప్రయత్నం చేసింది. దాంతో ఇద్దరూ భోజనం చేశారు.

ప్రియాంకను ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోవద్దన్న మానస్!
టాస్క్ విషయంలో తాను ఆడుతోంది కరెక్ట్ గా ఉందా? లేదా? అనే విషయంలో ప్రియాంకకు దిగులు ఎక్కువైపోయింది. జెస్సీ, షణ్ణు టీమ్ లో ఉన్న ప్రియాంక కాస్తంత ఒంటరితనం ఫీల్ అవుతున్నట్టు కనిపించింది. నిజానికి ఆమె టీమ్ లోని మొగవాళ్ళు ఇద్దరూ సంచాలికలుగా వ్యవహరిస్తున్న కాజల్, సిరికే బాగా క్లోజ్. దాంతో తన ఆట తీరుపై కలిగిన సందేహాన్ని మానస్ దగ్గర వ్యక్తం చేసింది ప్రియాంక. అలానే ‘బోర్డర్ క్రాస్ చేయొద్దని తరచూ నాకు చెబుతుంటావు ఎందుకు? నేనేమైనా అలా చేస్తున్నానా? ఇలా నిన్ను అడగడం నీకు ఇబ్బందిగా లేదు కదా!’ అంటూ సుతారంగా మనసులో సందేహాన్ని బయట పెట్టేసింది ప్రియాంక. ఆమె ప్రశ్నలకు మానస్ చెప్పిన సమాధానం చాలా మెచ్యూర్డ్ గా ఉంది. ఒకరి మీద ఇష్టం పెంచుకుంటే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడతాయి. అయి తీరకపోతే తిరిగి వాళ్ళను మనం హేట్ చేస్తాం. అలా ఉండకూడదనే బోర్డర్ క్రాస్ చేయొద్దని చెబుతున్నానని మానస్ వివరణ ఇచ్చాడు. ఈ చేదు నిజాన్ని అంగీకరించడం కష్టంగా అనిపించిన ప్రియాంక మౌనంగా కాసేపు రోదించింది. మొత్తం మీద 37వ రోజు రాత్రి బిగ్ బాస్ హౌస్ లో కాస్తంత భారంగానే అందరూ నిద్రకు ఉపక్రమించారు.

ఇక 38వ రోజు కూడా వచ్చిన మెటీరియల్ ను గుంజుకోవడం, ఓపికగా బొమ్మలను కుట్టుకోవడంతోనే సరిపోయింది. అయితే, టాస్క్ లో సమ్ థింగ్ ఏదో జరుగబోతోందని గ్రహించిన కొన్ని టీమ్స్ టాస్క్ ను లైట్ తీసుకున్నాయి. ఓవర్ గా కష్టపడి బొమ్మలను తయారు చేయకుండా, తమకు లభ్యమైన మెటీరియల్ ను ఉపయోగించి కొన్ని బొమ్మలే చేశాయి. అయితే… మొదటి రోజున బ్లూ టీమ్ 11, యెల్లో టీమ్ 10 బొమ్మలు చేయగా, రెడ్ అండ్ గ్రీన్ టీమ్స్ 7 బొమ్మలు చొప్పున చేశాయి. అలానే రెండో రోజు బ్లూ టీమ్ 6, ఎల్లో టీమ్ 2 బొమ్మలు చేయగా, రెడ్ అండ్ గ్రీన్ టీమ్స్ మూడేసి బొమ్మలు చేశాయి. ఇక గ్రీన్ టీమ్ తయారు చేసిన బొమ్మలో స్పెషల్ పవర్ కు సంబంధించిన స్లిప్ ఉండటంతో వారికి ఊహించిన అదృష్టం ఒకటి లభించింది. దాంతో ఎదుటి టీమ్ లోని బొమ్మలన్నింటినీ వీళ్ళు తీసేసుకొవచ్చు. ఆ రకంగా బ్లూ టీమ్ లో అత్యధికంగా 11 బొమ్మలు ఉండటంతో ఆ టీమ్ బొమ్మల్ని గ్రీన్ టీమ్ తీసుకుంది. బిగ్ బాస్ గేమ్ లో కేవలం కష్టపడే వారికే ఫలితం దక్కుతుందనే గ్యారంటీ లేదు. దానికి అదృష్టం కూడా తోడు కావాలని ఈ టాస్క్ తో నిరూపణ అయ్యింది.

అయితే 38వ రోజు సంచాలకులు కాజల్, సిరి బేలతనం మరోసారి బయట పడింది. మెటీరియల్ వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ ను అదుపు చేయడంలోనూ, బొమ్మల నాణ్యత పరిశీలించడంలోనూ, గేమ్ లోని రూల్స్ ను కరెక్ట్ గా ఫాలో చేసేలా చూడటంలోనూ వీరు విఫలం కావడంతో టాస్క్ ఆడుతున్న వాళ్ళు వీరిని నిలదీశారు. దాంతో ఒకానొక సమయంలో సిరి కంటనీరు పెట్టుకుంది. అలానే కొందరి మాటలతో హర్ట్ అయిన కాజల్ మరి కాసేపటికి సంభాళించుకుంది. కెప్టెన్సీ టాస్క్ కోసం జరుగుతున్న బీబీ బొమ్మల ఫ్యాక్టరీ గేమ్ పెద్దంత ఆసక్తిని కలిగించలేదు. పైగా ఏ టీమ్ ఓడిపోతే ఎవరికి లాభం అనే విషయంలోనూ వ్యూవర్స్ లో చాలా గందర గోళం నెలకొనేలా ఎడిటింగ్ ఉంది. అయినా… గురువారమే కెప్టెన్సీ టాస్క్ కు సంబంధించిన తుది తీర్పు వెలువడే ఆస్కారం ఉంది.

-Advertisement-బెడిసి కొట్టిన బిగ్ బాస్ బొమ్మల తయారీ!

Related Articles

Latest Articles