హైకమాండ్ నిర్ణయంతోనే సీఎంతో సమావేశానికి వెళ్లా: భట్టి విక్రమార్క

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు నడుస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో రాహుల్ వర్గం, సోనియా వర్గంగా నేతలు ఉంటారు తప్ప స్థానిక నేతలకు వర్గాలు ఉండవన్నారు. పార్టీలో వర్గాలు ఉన్నాయని ఎవరైనా అలా ఊహించుకుంటే వాళ్ల పొరపాటేనన్నారు. అయితే వ్యక్తులకు భిన్నాభిప్రాయాలు ఉంటాయని…. భావ వ్యక్తీకరణ అనేది మన దేశంలో ప్రజాస్వామ్య లక్షణమని ఆయన గుర్తుచేశారు.

ఒక్కోసారి మన భావాలను వ్యక్తీకరించినప్పుడు భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయని.. వాటిని కొట్లాటలుగా చూడటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని భట్టి విక్రమార్క తెలిపారు.

దేశంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని.. మిగతా పార్టీల నేతల దృష్టి మరల్చడానికి రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలోని బీజేపీ కలిసి కుట్రపన్నాయని… అందుకే ముందస్తు ఎన్నికలు అంటూ డ్రామాలు ఆడుతున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావు అనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.

అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ రాసిన విషయం హాట్ టాపిక్‌గా మారగా.. జగ్గారెడ్డి లేఖ రాసిన విషయం తాను పత్రికల ద్వారానే తెలుసుకున్నానని భట్టి తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గానికి తనకు సమాచారం ఇవ్వకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రావడాన్ని జగ్గారెడ్డి తప్పుబట్టగా.. ఆయనకు సమాచారం లోపించడంపై స్వయంగా మాట్లాడి తెలుసుకుంటానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

మరోవైపు సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి తాను వెళ్లడంపై పార్టీలో వ్యతిరేకత రావడంపైనా భట్టి విక్రమార్క స్పందించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను సీఎం కేసీఆర్‌తో సమావేశానికి వెళ్లానని కొందరు ప్రచారం చేస్తున్నారని.. తాను పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఉమ్మడి నిర్ణయంతోనే దళిత బంధు అంశంపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి వెళ్లానని భట్టి స్పష్టం చేశారు. కేసీఆర్‌తో కుమ్మక్కు అంటూ తనపై ప్రచారం చేయడంతో బాధపడ్డానని తెలిపారు. సీఎంతో తాను భేటీ కావడంపై స్పష్టత ఇవ్వాలని రేవంత్, మాణిక్యం ఠాగూర్‌లను అడిగానని… ఈరోజు వరకు వారు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.

Related Articles

Latest Articles