పాతికేళ్ళ ‘భారతీయుడు’

(మే 9న ‘భారతీయుడు’కు 25 ఏళ్ళు)

విలక్షణ నటుడు కమల్ హాసన్, డైనమిక్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్. రత్నం, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్ కలయికలో రూపొందిన ‘ఇండియన్’ చిత్రం తెలుగులో ‘భారతీయుడు’ గా అనువాదమై ఏకకాలంలో విడుదలయింది. 1996 మే 9న విడుదలైన ‘ఇండియన్’, ‘భారతీయుడు’ దక్షిణాది ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. తెలుగునాట కమల్ హాసన్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా మరింత విజయం సాధించింది.

ఆ చిత్రాల స్ఫూర్తి…
కొత్తదర్శకులు స్టార్ హీరోస్ తో సినిమాలు తీసేసమయంలో అంతకు ముందు స్టార్స్ గా జేజేలు అందుకున్న వారి సినిమాలను పోలిన కథలతోనే అప్రోచ్ అవుతుంటారు. శివాజీ గణేశన్ ‘తంగపతక’ కథలో దేశద్రోహి అయిన కన్నకొడుకును కథానాయకుడు చివరకు కడతేరుస్తాడు. ఈ చిత్రం తెలుగులో ‘బంగారుపతకం’ పేరుతో అల్లు అరవింద్ అనువదించారు. ఇక్కడా మంచి విజయం సాధించింది. ఆ కథలాగే ‘భారతీయుడు’లోనూ దేశంలో చీడపురుగులాంటి కొడుకును ఓ నాటి స్వాతంత్ర్య సమరయోధుడు సేనాధిపతి మట్టుపెడతాడు. ప్రధానాంశం ఇదే అయినా, దీనికి దాసరి నారాయణరావు ‘సర్దార్ పాపారాయుడు’ ప్రేరణ కూడా కనిపిస్తుంది. అందులోలాగే బ్రిటిష్ వారిపై పోరాటం చేసే వీరుడు, తెల్లవారి దాస్టీకానికి గురయిన ఓ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాడు. ఆ తరువాత కథ ‘తంగపతక’ మార్గం పడుతుంది. స్వతహాగా శివాజీ గణేశన్ అభిమాని అయిన కమల్ హాసన్ కు ఈ కథ భలేగా నచ్చింది. అయితే కథ విన్న తరువాత కమల్ హాసన్ , డైరెక్టర్ శంకర్ ను కొన్ని ప్రశ్నలు అడిగారట! దేశానికి స్వాతంత్ర్యం రావడం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన సేనాధిపతి, స్వరాజ్యం వచ్చిన తరువాత పల్లెలో తాపీగా కూర్చొని ఉంటాడా? అన్నదే ఆ ప్రశ్న. కమల్ హాసన్ ప్రశ్నలో ఓ బలముంది. కానీ, అప్పటికే తన కథలోని లొసుగుల కంటే, దానిని తెరకెక్కించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు శంకర్. అందువల్ల కమల్ అనుమానానికి ఆయన సరైన విధంగా స్పందించలేకపోయారు. అయినా ఈ సినిమాను జనరంజకంగా మలచడంలో శంకర్ కృతకృత్యులయ్యారు. మొదట్లో శంకర్ పనితనంపై అనుమానపడిన కమల్ హాసన్ సినిమా విడుదలై విజయఢంకా మోగించిన తరువాత తన అనుమానాలను పక్కకు నెట్టారు.

ప్రధాన ఆకర్షణలు…
‘భారతీయుడు’ చిత్రానికి ముందు శంకర్ ‘జెంటిల్ మేన్’, ‘ప్రేమికుడు’ చిత్రాలను మాత్రమే రూపొందించారు. ఆ రెండు చిత్రాలు తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. దాంతో శంకర్ కు ఓ స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అందునా, శంకర్ తొలిసారి కమల్ హాసన్ వంటి స్టార్ యాక్టర్ తో పనిచేయడంతో మొదటి నుంచీ ‘భారతీయుడు’పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో సేనాధిపతి ముసలివాడైన తరువాతి గెటప్ చూసి ఎంతోమంది ప్రఖ్యాత తాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి లాగా ఉందని భావించారు. కమల్ హాసన్ గెటప్స్, అభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కాగా, శంకర్ దర్శకత్వం రెండవ స్థానం ఆక్రమిస్తుంది. ఇక ఎ.ఆర్.రహమాన్ బాణీలు మూడో స్థానంలో నిలుస్తాయి. రాజీపడని రత్నం నిర్మాణదక్షత కూడా ఓ ఎస్సెట్ గానే భావించాలి. వీటిన్నిటితో పాటు ఆ నాటి అందాల భామలు మనీషా కొయిరాలు, ఊర్మిళ మటోంద్కర్ గ్లామర్ కూడా మరో ఎస్సెట్ గా భావించాలి.

పాటల పందిరి…
‘భారతీయుడు’ చిత్రంలోని పాటలు అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ విశేషాదరణ చూరగొన్నాయి. “పచ్చని చిలకలు తోడుంటే…”, “టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా…”, “తెప్పలెల్లిపోయాక ముప్పు తొలగిపోయిందే…”, “మాయా మశ్చీంద్రా మచ్చను చూడగ వచ్చావా…”,”అదిరేటి డ్రెస్సు మీరేస్తే…” పాటలు యువతను ఊపేశాయి. భువనచంద్ర పలికించిన ఈ పాటలు ఈ నాటికీ సందర్భానుసారంగా జనాన్ని పలకరిస్తూనే ఉంటాయి. ఈ చిత్రంలో సుకన్య, కస్తూరి, నెడుముడి వేణు, గౌండ్రమణి, సెంథిల్, నిలల్ గళ్ రవి, క్రేజీ మోహన్, మనోరమ, పొన్నాంబులమ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి తగిన రీతిన జీవా కెమెరా పనితనం, తోట తరణి కళాదర్శకత్వం కుదిరాయి.

రికార్డులు…
అంతకు ముందు తమిళ, తెలుగు భాషల్లో కలిపి రజనీకాంత్ ‘బాషా’ పలు రికార్డులు నెలకొల్పింది. వాటిని ‘భారతీయుడు’ బ్రేక్ చేసింది. మళ్ళీ రజనీకాంత్ ‘చంద్రముఖి’ దాకా ఈ సినిమా రికార్డులే పదిలంగా ఉన్నాయి. ఈ చిత్రానికి మూడు నేషనల్ అవార్డులు లభించాయి. ఉత్తమ నటునిగా కమల్ హాసన్, ఉత్తమ కళాదర్శకునిగా తోట తరణి, విజువల్స్ ఎఫెక్ట్స్ లో ఎస్.టి.వెంకీ జాతీయ అవార్డులు అందుకున్నారు.
ఈ సినిమాకు సీక్వెల్ గా ఆ మధ్య కమల్ హాసన్ తోనే శంకర్ ఓ చిత్రం ఆరంభించారు. అయితే కమల్ రాజకీయప్రవేశం కారణంగా ఆ చిత్రం వాయిదాపడింది. ఇప్పుడు కమల్ హాసన్ పార్టీ పరాజయం పాలయింది. కాబట్టి, ఆయన మళ్ళీ నటనపైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. అందువల్ల ‘ఇండియన్-2’ వస్తుందని ఆశించవచ్చు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-