45 ఏళ్ళ ‘భక్త కన్నప్ప’

‘రెబల్ స్టార్’గా జనం మదిలో నిలచిన కృష్ణంరాజును నటునిగా ఓ మెట్టు పైకి ఎక్కించిన చిత్రం ‘భక్త కన్నప్ప’. బాపు, రమణ రూపకల్పనలో రూపొందిన ‘భక్త కన్నప్ప’తో నటునిగా కృష్ణంరాజుకు ఆ రోజుల్లో మంచి పేరు లభించింది. తొలి చిత్రం ‘చిలక-గోరింక’లోనే కథానాయకునిగా నటించిన కృష్ణంరాజు ఆ తరువాత చిత్రసీమలో నిలదొక్కుకోవడానికి కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గా కూడా నటించారు. కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ లోనూ కనిపించారు. హీరోగానూ కొన్ని సినిమాల్లో నటించినా, అవేవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో సొంత చిత్రాలవైపు దృష్టి సారించి, తొలి ప్రయత్నంగా మిత్రులతో కలసి ‘కృష్ణవేణి’ చిత్రం నిర్మించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత కృష్ణంరాజుకు హీరో వేషాలు రాసాగాయి. అయితే అవి కూడా ఆయనను సక్సెస్ ట్రాక్ లో నిలపలేకపోయాయి. ఆ సమయంలో బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు సొంత చిత్రంగా రూపొందిన ‘భక్త కన్నప్ప’ అనూహ్య విజయం సాధించి, రాజుకు స్టార్ డమ్ సంపాదించి పెట్టింది.

కృష్ణంరాజు, దర్శకుడు బాపు ఇద్దరూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారే. అంతకు ముందు బాపు తెరకెక్కించిన ‘బుద్ధిమంతుడు’లో కృష్ణంరాజు నటించారు. అందువల్ల బాపు దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని కృష్ణంరాజు, ఆయన తమ్ముడు సూర్యనారాయణ రాజు భావించారు. ఏదైనా వైవిధ్యమైన చిత్రమయితే నటునిగా తనకూ ఓ గుర్తింపు లభిస్తుందని కృష్ణంరాజు ఆశించారు. ఆ సమయంలో ముళ్లపూడి వెంకటరమణ ‘భక్త కన్నప్ప’ కథను సూచించారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు హీరోగా పేరు సంపాదించిపెట్టిన తొలి చిత్రం ‘బేడర కన్నప్ప’. ఈ సినిమా తెలుగులో ‘కాళహస్తి మహాత్మ్యం’గా విడుదలై తెలుగునాట కూడా అలరించింది. అందువల్ల కన్నప్ప కథను మరింత వైవిధ్యంగా రూపొందించాలని భావించారు. పాశుపతాస్త్రాన్ని పొందిన అర్జునుడు, శివుని మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. అందుకు శివుడు తరువాతి జన్మలో తిన్నడిగా పుట్టి భక్త కన్నప్పగా వెలసి మోక్షం పొందుతావని ఆశీర్వదిస్తాడు. అలా ఓ గూడెం వారికి దొరికిన తిన్నడు, తొలినుంచీ దేవుడు లేడనే వాదంతో ఉంటాడు. తరువాత తన భార్యతో కలసి గూడెం నుండి బయటకు వచ్చి, కాళహస్తి చేరతాడు. అక్కడ అడవి జంతువులను వేటాడి జీవిస్తున్న తిన్నడికి ఓ సారి శివసాక్షాత్కరం లభిస్తుంది. తరువాత పరమభక్తుడై శివుని సేవిస్తూ ఉంటాడు. భోగలాలసుడైన ఆ దేవాలయ పూజారి దేవుని సొమ్ము తస్కరించి, ఆ నేరం తిన్నడిపై వేస్తాడు. దాంతో తిన్నడిని కట్టేసి కొడతారు. శివభక్తితో పరవశించిపోయిన తిన్నడికి ఆ దెబ్బలు తగలవు. శివుని కళ్ళ నుండి కన్నీరు కారుతుంది, తరువాత రక్తం వస్తుంది. స్వామికి తన కళ్ళనే ఇస్తాడు అమాయకుడైన తిన్నడు. అతని భక్తికి మెచ్చి మోక్షం ప్రసాదిస్తాడు శివుడు. కళ్ళనే దానం చేసిన తిన్నడు భక్త కన్నప్పగా నిలచిపోయాడు. కాలక్రమేణ కాళహస్తిని సందర్శించే భక్తులు ముందుగా భక్త కన్నప్పను దర్శించుకోవడం ఆచారంగా మారింది. ఈ కథను బాపు,రమణ తమదైన శైలిలో తెరకెక్కించారు.

గోపీకృష్ణా మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, వాణిశ్రీ, రావు గోపాలరావు, శ్రీధర్, బాలయ్య, ప్రభాకర్ రెడ్డి, ముక్కామల, సారథి, పి.ఆర్. వరలక్ష్మి, జయమాలిని ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి సత్యం సంగీతం సమకూర్చగా, ఆరుద్ర, సినారె, వేటూరి పాటలు రాశారు. వేటూరి కలం పద్యాలు కూడా పలికించింది. ఈ చిత్రంలో కితార్జునీయం ను వేటూరి గేయరూపంలో పలికించిన తీరు ఆకట్టుకుంది. “కండ గెలిచింది… కన్నె దొరికింది…”, “ఎన్నియెల్లో ఎన్నియెల్లో…” , “ఆకాశం దించాలా నెలవంక తుంచాలా…”, “శివ శివ అననేలరా…” పాటలు భలేగా ఆకట్టుకున్నాయి. ఇక “శ్రీకంఠ లోకేశ…” అంటూసాగే కాళహస్తీశ్వరునిపై వేటూరి రాసిన దండకం కూడా మురిపించింది. అన్నిటినీ మించి “శివ శివ శంకర…భక్త వశంకర…” పాట జనాన్ని ఎంతగానో అలరించింది. ఈ నాటికీ శివరాత్రి వస్తే చాలు తప్పకుండా ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది.

‘భక్త కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగం ఔట్ డోర్ లోనే చిత్రీకరణ జరుపుకుంది. దాంతో ప్రేక్షకులకు కొత్తదనం కనిపించింది. అప్పటి దాకా కృష్ణంరాజు ఎన్నడూ ధరించని వైవిధ్యమైన పాత్ర కావడంతో ఆయనకు నటునిగా ఈ సినిమా మంచి మార్కులు సంపాదించి పెట్టింది. ఆయన కోరుకున్నట్టుగానే ‘భక్త కన్నప్ప’ మంచి విజయం సాధించి, స్టార్ డమ్ సంపాదించి పెట్టింది. తమ సొంత చిత్రాలు “కృష్ణవేణి, భక్త కన్నప్ప” రెండింటిలోనూ వాణిశ్రీ నాయిక కావడంతో ఆమె కృష్ణంరాజుకు లక్కీ హ్యాండ్ అనే పేరు సంపాదించారు. ఈ చిత్రం అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. కృష్ణంరాజు కెరీర్ లో తొలి ద్విశతదినోత్సవ చిత్రంగా ‘భక్త కన్నప్ప’ నిలచింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-