అలాంటి మెసేజ్‌లతో జాగ్రత్త…ఆదమరిస్తే అంతే!

సోషల్ మీడియా బాగా విస్తరించింది. అపరిచిత వ్యక్తులు ఏవో మెసేజ్‌లు పంపుతూ వుంటారు. వాటికి స్పందించారంటే అంతే సంగతులు. మిమ్మల్ని చాలా తెలివిగా బుట్టలో వేసుకుంటారు దుండగులు. అనవసరమైన మెసేజ్‌లకు రిప్లై ఇస్తే, జేబులకు చిల్లుపడడం ఖాయం. హైదరాబాద్‌లో అనేక మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది కిలాడీ గ్యాంగ్‌. సెల్‌ఫోన్‌కు అవసరమైన మెసేజ్‌లతో పాటు అనవసరమైన మెసేజ్‌లు వస్తుంటాయి. ఒక నెంబర్‌ పంపించి… మీతో స్నేహం చేయాలని ఉందనో, లేక మీకు ఫోటోలు పంపించాం ఎవరు కావాలో ఎంచుకోండి అంటు వల విరుసుతున్నారు దుంగలు.

ఇలాంటి మెసేజ్‌లకు రిప్లై ఇస్తే… వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి, జేబుకు చిల్లు పెడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ముఠాలు బారిన పడిన అనేక మంది అమాయకులు చేతి చమురు వదలించుకున్నారు. ఇలాంటి మెసేజ్‌లపై తమకు ఫిర్యాదు చేయాల్సిందిగా కోరుతున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.

ఇటీవల ఓ వ్యక్తికి అమ్మాయి ఫొటోలను పంపారు దుండగులు. అందులోంచి ఒకర్ని ఎంపిక చేసుకోవాలంటూ సూచించారు. దీనికి ఆ వ్యక్తి స్పందిస్తూ… తనకు ఎవరూ వద్దని రిప్లై ఇచ్చారు. దీంతో అవతలి నుంచి కేటుగాళ్లు బెదిరింపులకు దిగారు. అతని వాట్స్‌యాప్‌ డీపీని మార్ఫింగ్ చేసి అతనికే పంపించారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే, ఆ ఫోటోను సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో బాధితుడు వాళ్లకు లక్షన్నర పంపించాడు. దీంతో అవతలి వ్యక్తులు మరింత రెచ్చిపోయారు. మరింత డబ్బు డిమాండ్‌ చేయడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గతంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టా గ్రామ్‌ వంటి వాటిల్లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించి… తర్వాత వాళ్ల డీపీలను తమ డీపీలుగా పెట్టుకొనే వాళ్లు కేటుగాళ్లు. ఆపదలో ఉన్నాం డబ్బులు ఇవ్వండంటూ స్నేహితులకు రిక్వెస్ట్‌లు పెట్టేవాళ్లు. ఇప్పుడు వాట్సప్‌ డీపీలను మార్ఫింగ్‌ చేసి డబ్బులు గుంజుతున్నారు. మొత్తానికి అపరిచిత వ్యక్తులు పంపే లింకులు, సంబంధం లేని లింకుల్ని పట్టించుకోకపోవడమే ఉత్తమం అంటున్నారు అధికారులు.

Related Articles

Latest Articles