50 ఏళ్ళ ‘భార్యాబిడ్డలు’

తెలుగునాట పురుడు పోసుకున్న ఓ కథ, హిందీలో తిరిగి వస్తే, మళ్ళీ దానిని పట్టుకొని సినిమాలు తీసిన వారున్నారు. అలాంటి సినిమాల్లో ఒకటి ‘భార్యాబిడ్డలు’. నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1953లో నటించిన ‘బ్రతుకు తెరువు’ ఆధారంగానే ‘భార్యాబిడ్డలు’ రూపొందింది. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తాతినేని రామారావు దర్శకత్వంలో ఏ.వి.సుబ్బారావు నిర్మించిన ‘భార్యాబిడ్డలు’ 1972 జనవరి 15న విడుదలయింది.

‘భార్యాబిడ్డలు’ కథ విషయానికి వస్తే – మోహన్ కు పెళ్ళయి భార్యాబిడ్డలు ఉంటారు. వారితో పాటు చిన్నతమ్ముళ్ళు, చెల్లెళ్లు కూడా అతనిపైనే ఆధారపడతారు. వారిని పోషించడానికి పట్నం చేరి, ఉద్యోగాన్వేషణ చేస్తూంటాడు. అదే సమయంలో మోహన్ మిత్రుడు డాక్టర్ మనోహర్ తారస పడతాడు. అతని వల్ల రాజారావు అనే ధనవంతుని వద్ద ఉద్యోగం సంపాదిస్తాడు మోహన్. తరువాత మనోహర్ విదేశాలకు వెళతాడు. రాజారావు కూతురు రాధాకు హృద్రోగంతో పాటు, కాళ్ళు చచ్చుపడి ఉంటాయి. ఆమెకు మోహన్ మంచి తనం నచ్చుతుంది. ఆమె ఓకే అంటేనే అక్కడ ఉద్యోగం అని తేలడంతో, మోహన్ తనకు పెళ్ళి కాలేదని చెబుతాడు. మోహన్ గయ్యాళి అక్క పిల్లలను తన్ని బయటకు పంపుతుంది. పిల్లలు, మోహన్ ను వెదుక్కుంటూ పట్నం వస్తారు. వారిని తీసుకొని డాక్టర్ మనోహర్ ఇంటిలో పెడతాడు. విచిత్రంగా రాధకు, మోహన్ సాహచర్యంలో అన్నీ నయమవుతాయి. అదే సమయంలో మోహన్ భార్య సుశీలకు రాధతో పరిచయం అవుతుంది. రాధ మోహన్ ను చూపించి, తాను అతణ్ణి పెళ్ళిచేసుకోబోతున్నట్టు చెబుతుంది. సుశీల అది తెలిసి కళ్ళు తిరిగి పడుతుంది. దాంతో మోహన్ అసలు కథ బయట పడుతుంది. అందరూ మోహన్ ను దోషిగా చూస్తారు. కానీ, అతను తన పరిస్థితి వివరిస్తాడు. అదే సమయంలో ఎప్పటి నుంచో రాధను పెళ్ళాడాలనుకుంటున్న శేషు ఆమెను కిడ్నాప్ చేస్తాడు. మోహన్ వెళ్ళి రక్షిస్తాడు. మోహన్ ఆమెకు నిజం చెబుతాడు. అయితే, పరిస్థితుల కారణంగానే మోహన్ అలా చేశాడని తండ్రికి కూడా చెబుతుంది రాధ. అదే సమయానికి విదేశాల నుండి మనోహర్ తిరిగి వస్తాడు. అతనికి రాధంటే ఇష్టం అని తెలుసుకుంటారు. రాధ కూడా అతని చేయి అందుకోవడానికి అంగీకరించడంతో కథ సుఖాంతమవుతుంది.

ఇందులో ఏయన్నార్, జయలలిత, కృష్ణకుమారి, గుమ్మడి, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, రాజబాబు, పి.జె.శర్మ, పొట్టి ప్రసాద్, సూర్యకాంతం, హేమలత, సుమ, బేబీ శ్రీదేవి నటించారు. ఈ చిత్రానికి కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చగా, ఆచార్య ఆత్రేయ పాటలు, మాటలు పలికించారు. ఇందులోని “చక్కనయ్యా చందమామా…”, “ఆకులు పోకలు ఇవ్వొద్దు…”, “భలే భలే నచ్చారు…”, “చల్ మోహనరంగ…”, “బ్రతుకు పూలబాట కాదు…”, “వలచీనానమ్మా…” పాటలు విశేషాదరణ చూరగొన్నాయి.

తొలుత 1953లో పి.రామకృష్ణ దర్శకత్వంలో ‘బ్రతుకు తెరువు’ చిత్రం తెరకెక్కింది. ఏయన్నార్, సావిత్రి, ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తమిళంలో ‘బలే రామన్’ పేరుతో అనువదించారు. ఇదే కథను తరువాతి రోజుల్లో ఎల్.వి.ప్రసాద్ హిందీలో ‘జీనే కీ రాహ్’ ఫేరుతో స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జితేంద్ర, తనూజ, సంజీవ్ కుమార్ నటించిన ఈ సినిమా హిట్ అయింది. ఎల్వీ ప్రసాద్ హిందీలో చేసిన మార్పులు నచ్చిన ఏ.వి.సుబ్బారావు ఆ కథను తెలుగులో ‘భార్యాబిడ్డలు’గా నిర్మించారు. ఇందులో మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు నటించడం విశేషం. కాగా, ఇదే కథను తమిళంలో ఎమ్.జి.రామచంద్రన్, కాంచన, కె.ఆర్.విజయ ముఖ్యపాత్రల్లో తెరకెక్కించారు. ‘బ్రతుకు తెరువు’ కథ అలా అన్ని చోట్లా విజయం సాధించింది.

Related Articles

Latest Articles