ఇండియన్ ఐడల్ సింగర్స్ పై బప్పీలహరి కానుకల వర్షం!

ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి ఇండియన్ ఐడల్ 12 సింగర్స్ ను ఆదివారం ఆనందంలో ముంచెత్తారు. స్టార్ కంపోజర్ ఈ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ భిన్నమైన బహుమతులు ఇచ్చి వారి జీవితంలో మర్చిపోలేని అనుభూతులకు గురిచేశారు. అరునిత కంజీలాల్ తో పని కట్టుకుని బెంగాలీ పాటను పాడించుకున్న బప్పీలహరి ఆమెకు ఓ చీరను బహుమతిగా ఇవ్వడంతో పాటు రికార్డింగ్ కాంట్రాక్ట్ చేసుకున్నారు. అలానే సైలీ కుంబ్లే పాడిన పాటలకు ఫిదా అయిపోయిన బప్పీలహరి ఆమె నివాసం ఉండే ఇంటిలోని పర్శనల్ రూమ్ ను రెన్నోవేట్ చేసి బహుమతిగా ఇచ్చారు. ఆమె గదిని అందంగా మార్చడంతో పాటు అక్కడ ఖరీదైన టీవీని ఏర్పాటు చేశారు.

ఇక తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ పాడిన పాటలకూ బప్పీలహరి ఖుషీ అయిపోయారు. విశేషం ఏమంటే.. ఇదే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన ప్రముఖ దర్శకుడు ఒమంగ్ కుమార్ షణ్ముఖ ప్రియతో తన కొత్త చిత్రంలో ఓ పాట పాడిస్తానని మాట ఇచ్చి, ఆ తర్వాత అన్ని పాటలూ ఆమెతోనే పాడిస్తానని చెప్పారు. అంతేకాదు… స్టేజ్ మీదనే ఐదు నిమిషాల్లో షణ్ముఖ ప్రియ స్కెచ్ ను అద్బుతంగా గీసి, ఒమంగ్ కుమార్ ఆమెకు బహుమతిగా ఇవ్వడం మరో విశేషం. ఇక పవన్ దీప్ రాజన్ కు బప్పీలహరి తన తబ్లాను కానుకగా ఇచ్చారు. చివరగా సింగర్ నిహాల్ గానానికి ముగ్ధుడైన బప్పీలహరి బంగారు గొలుసును కానుకగా ఇచ్చారు. ఈ కార్యక్రమం 70 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ భారీ కేక్ ను తెప్పించి అందరి సమక్షంలో కట్ చేయించారు బప్పీలహరి. మొత్తం మీద ఈ సంచలన సంగీత దర్శకుడు… ఇండియన్ ఐడిల్ సింగర్స్ కు తనదైన శైలిలో శుభాశీస్సులు అందించారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-