రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మహ్మదుల్లా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది ప్రారంభంలో జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్​తో తిరిగి జట్టులోకి పునరాగమనం చేసిన అతడు.. ఎక్కువకాలం టెస్టుల్లో కొనసాగేందుకు సిద్ధంగా లేనని ఆ సమయంలోనే బోర్డుకు సూచించాడు. దీంతో పాకిస్థాన్​తో టెస్టు సిరీస్​కు ముందు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం నుంచి బంగ్లాదేశ్-పాకిస్థాన్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు క్రికెట్‌లో 50 టెస్టులు ఆడిన మహ్మదుల్లా 33.11 సగటుతో 2,914 పరుగులు చేశాడు. అతడి పరుగుల్లో ఐదు సెంచరీలు, 16 అర్థసెంచరీలు ఉన్నాయి. కెరీర్ అత్యధిక స్కోరు (150)ను జింబాబ్వేపై నమోదు చేశాడు.

Read Also: ఐసీసీ టీ20 ర్యాంకులు.. భారత్ నుంచి ఒకేఒక్కడు

టెస్టు కెరీర్‌ను ముగించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు మహ్మదుల్లా ప్రకటించాడు. తన కెరీర్‌లో తనకు అండగా నిలిచిన, మద్దతు తెలిపిన బంగ్లా క్రికెట్ బోర్డుకు అతడు కృతజ్ఞతలు తెలియజేశాడు. తనకు సహకారం అందించిన తోటి ఆటగాళ్లకు, సహాయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. అయితే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినా టీ20లు ఆడతానని మహ్మదుల్లా తెలిపాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ టీ20 జట్టుకు మహ్మదుల్లా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Related Articles

Latest Articles