‘మా’ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్! పోటీ నుండి తప్పుకున్న బండ్ల గణేశ్!

ఈ నెల 10న జరుగబోతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి బరిలోకి దిగుతానని చెప్పిన బండ్ల గణేశ్… ఆ ప్యానెల్ నుండి జీవితా రాజశేఖర్ జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా నిలబడటంతో కినుక వహించాడు. అంతేకాదు… ఆ ప్యానెల్ నుండి బయటకు వచ్చేసి, స్వతంత్ర అభ్యర్థిగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తానని చెప్పాడు. అన్నమాట ప్రకారం… సెప్టెంబర్ 27న ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ వేశాడు.

అయితే… ఇప్పుడు బండ్ల గణేశ్ మనసు మార్చుకున్నాడు. ”నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించు కున్నాను” అని సోషల్ మీడియా ద్వారా బండ్ల గణేశ్ శుక్రవారం తెలియచేశాడు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ తో కలిసి దిగిన ఫోటోను, నామినేషన్ ఉపసంహరించుకుంటూ ‘మా’ ఎన్నికల అధికారికి ఇచ్చిన లేఖను కూడా ఈ పోస్ట్ తో జత చేశాడు. జీవితను ఓడించడానికే మెగా ఫ్యామిలీ బండ్ల గణేశ్ ను ‘మా’ ఎన్నికల బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టిందని ఒక వర్గం చేస్తున్న ప్రచారానికి తెర పడినట్టు అయ్యింది. మరి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన జీవిత, మంచు విష్ణు ప్యానల్ నుండి పోటీచేస్తున్న రఘుబాబు లో ఎవరు జనరల్ సెక్రటరీగా తెలుస్తారో చూడాలి.

-Advertisement-'మా' ఎన్నికల్లో కొత్త ట్విస్ట్! పోటీ నుండి తప్పుకున్న బండ్ల గణేశ్!

Related Articles

Latest Articles