వైద్య వసతులు పెంచడంలో టీఆర్ఎస్ నిర్లక్ష్యం చూపింది : బండి

కరోనా విపత్తుతో ప్రజలు చితికిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్సను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ కి వినతిపత్రం సమర్పించారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్.

అందులో ”కరోనాను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైంది. ఫలితంగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చకపోవడంతో గ్రామీణులు ముఖ్యంగా పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వైద్య వసతులు పెంచడంలో టీఆర్ఎస్ నిర్లక్ష్యం చూపింది, ఫలితంగా పేదలకు కరోనా కష్టాలు మరింత పెరిగాయి. ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేవు, గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు, మధ్య తరగతి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటులో చికిత్స చేయించుకునేందుకు పేదలు ఆస్తులు అమ్ముకుంటున్నారు, అప్పుల్లో కూరుకుపోతున్నారు. కేంద్ర పథకం ‘ఆయుష్మాన్ భారత్’లో కరోనా చికిత్స ఉచితంగా అందిస్తున్నట్టు ‘ఆరోగ్య శ్రీ’ కింద ఉచితంగా కరోనా చికిత్స చేయాలి. ఏడాది కాలంగా కరోనాను ‘ఆరోగ్య శ్రీ’లో చేర్చాలన్న డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ చికిత్సలు చేయడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిలను తక్షణమే చెల్లించాలి. తెలంగాణలో ‘ఆయుష్మాన్ భారత్’ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పి దాదాపు ఏడాదవుతున్నా ఇంతవరకు అమలు చేయడం లేదు. 30 డిసెంబర్ 2020న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన వీడియా కాన్ఫరెన్సులో పాల్గొన్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీ సోమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ‘ఆయుష్మాన్ భారత్’ అమలు చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి. ఇకనైనా తెలంగాణలో ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అమలు చేయాలి. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలి” అని వినతిపత్రంలో పేర్కొన్నారు బందో సంజయ్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-