ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా : బండి సంజయ్

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా అని నిరుద్యోగ అభ్యర్థులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. సమగ్ర శిక్ష అభియాన్ లో 704 పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ ఏడాదిన్నరగా జాప్యం జరుగుతుండటంపట్ల ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ అంశాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా ఒత్తిడి తెస్తానని సమగ్ర శిక్ష అభియాన్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు హామీ ఇచ్చారు. స్పెషల్ ఎడ్యుకేషన్ వేల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష అభియాన్ నిరుద్యోగ అభ్యర్థులు ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిసి ఈ అంశంపై వినతి పత్రం అందజేశారు.

సమగ్ర శిక్ష అభియాన్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేషర్, ఐఈఆర్పీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్, సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ ప్రోగ్రామర్ నియామకాలకు సంబంధించి 704 పోస్టులను భర్తీ చేసేందుకు 2019 జూన్ 11న నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం డిసెంబర్ 23న పరీక్షలు నిర్వహించడంతోపాటు 2020 జనవరి 7న ఫలితాలను కూడా ప్రకటించి మెరిట్ కార్డులు కూడా జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులు బండి సంజయ్ కుమార్ ద్రుష్టికి తీసుకొచ్చారు. ర్యాంకులు ప్రకటించి ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు నియామక పత్రాలు అందజేయలేదని, దీంతో ఈ పరీక్షల్లో అర్హత సాధించిన 10 వేల మంది అభ్యర్థులు నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై అధికారుల నుండి ఎలాంటి సమాచారం కూడా లభించడం లేదని వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారుల ద్రుష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి క్రుషి చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ కమార్ నియామక ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని నిరుద్యోగ అభ్యర్థులకు హామీ ఇచ్చారు.

Related Articles

Latest Articles