బండి సంజయ్.. మరో బాంబ్ పేల్చారుగా..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బండి సంజయ్ వాడిన సర్జికల్ స్ట్రైక్స్ అన్న పదం.. ఎంతటి ప్రభావాన్ని కలిగించిందో మనం ప్రత్యక్షంగా చూశాం. బీజేపీ అనూహ్య ఫలితాలను సొంతం చేసుకుని.. జీహెచ్ఎంసీలో బలం పుంజుకున్న తీరును సైతం గమనించాం. ఇదే ఒరవడిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముందుకు తీసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇందుకు నిదర్శనం.

ఉత్తరప్రదేశ్ లో మాదిరిగా.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. వెంటనే జనాభా నియంత్రణ చట్టం తీసుకువస్తామని బండి సంజయ్ ఈ పాదయాత్రలో ప్రకటించారు. అంతే కాదు.. మతపరమైన రిజర్వేషన్లను సైతం అడ్డుకుని తీరుతామని తేల్చి చెప్పారు. స్పష్టమైన ఈ విధానంతో పార్టీకి ఎంత వరకూ మైలేజ్ వస్తుందో రాదో తెలియదు కానీ.. కొన్ని వర్గాలు కచ్చితంగా ప్రభావితం అవుతాయని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.

కాకపోతే.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి అనుచరగణం ఎక్కువ కాబట్టి అద్భుత ఫలితాలు సాధించిందని.. ఆ స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువ అని సైతం అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాన్ని బండి సంజయ్ తో పాటు.. బీజేపీ తెలంగాణ వ్యూహకర్తలు, పార్టీ అధిష్టానం కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుందని.. రాను రాను.. పార్టీ విధానాలు మరింత దూకుడుగా మారబోతున్నాయని సైతం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో పార్టీ అధ్యక్షులుగా పని చేసిన వారితో పోలిస్తే.. బండి సంజయ్ కాస్త భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. ప్రజల నాడిని పట్టుకుని.. అధికార పక్షంపై విమర్శలు చేసే దిశగా ముందుకు పోతున్నారు. రానున్న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సైతం ఘనంగా నిర్వహించి.. అధికార పక్షంపై మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్.. జనాభా నియంత్రణ చట్టం తెరపైకి తెచ్చి మరో బాంబ్ పేల్చారు.

ఈ ప్రతిపాదనపై.. రాజకీయ వర్గాల్లో చర్చ జరగడం ఖాయం. అలాగే మతపరమైన రిజర్వేషన్లపైనా చర్చ జరగడం అంతకన్నా ఖాయం. ఆయా అంశాలపై అధికార టీఆర్ఎస్ తో పాటు.. ఎంఐఎం పార్టీ ఎలా స్పందిస్తుంది.. మధ్యలో కాంగ్రెస్ ఎలా తల దూరుస్తుంది.. ఇతర పార్టీలు ఏమని స్పందిస్తాయి.. అన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకంగానే మిగిలింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-