హుజురాబాద్ లో కీలకంగా మారనున్న పోస్టల్‌ బ్యాలెట్స్‌…

త్వరలో జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులకు ప్రతి ఓటూ కీలకమే. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగనున్న ఈ పోరులో ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీ రాకపోవచ్చు. వందల ఓట్ల తేడానే ఉంటుందని పరిశీలకు బావిస్తున్నారు. దుబ్బాక కన్నా ఇంకా టఫ్‌ ఫైట్‌ ఉంటుందని బావిస్తున్నారు. నిరుడు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన రావు, టీఆర్‌ఎస్‌ క్యాండిడేట్‌ సోలిపేట సుజాతా రెడ్డి మధ్య జరిగిన హోరీ హోరీ పోరు జరిగింది. రఘునందన రావు కేవలం వెయ్యి డెబ్బయ్‌ తొమ్మిది ఓట్లతో బయటపడ్డాడు. ఇప్పుడు హుజూరాబాద్‌లో కూడా అదే రిపీట్‌ అవుతుందని అంచనా. ఈ సారి ఎవరు అలా బయటపడతారో చెప్పలేం.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ గెలుపు నాదంటే నాదన్న ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు చేయని ప్రయత్నం లేదు. గడప గడపకు వెళ్లి ఓటడుగుతున్నారు. ఇరు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో మకాం వేసి ప్రచారం హోరెత్తిస్తున్నారు. రాబోవు రోజుల్లో అది మరింత రసకందాయంలో పడనుంది. అయితే ఈ ఎన్నికల్లో నేతల తలరాతలు మార్చేది పోస్టల్‌ బ్యాలెట్లు. హుజూరాబాద్‌లో 12 వేల పోస్టల్‌ బ్యాలెట్స్‌ ఉన్నాయి. ఇది ఈ సారి ఈ నియోజకవర్గం ప్రత్యేకత.

ఎన్నికల కమిషన్ అమలులోకి తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4 వేల 454 మంది ఉన్నారు. వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఉంది. అలాగే 8 వేల 139 మంది వికలాంగ ఓటర్లు ఉన్నారు. వారు కూడా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

వృద్ధులు, వికలాంగులతో పాటు పోస్టల్ బ్యాలెట్‌ల ద్వారా 147 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య 6 నుంచి 7 శాతం వరకు ఉంటుంది. ఇది ఎన్నికల్లో గెలుపు మార్జిన్ కావచ్చు. దీంతో హుజురాబాద్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా కీలకంగా మారాయి. ప్రతి పోస్టల్ ఓటును తమకు అనుకూలంగా మలచుకోవడానికి రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. పార్టీలు ఇప్పటికే ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీల కార్యకర్తలు తమకు ఓటు వేయమని పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. వారిని ఆకర్షించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.

-Advertisement-హుజురాబాద్ లో కీలకంగా మారనున్న పోస్టల్‌ బ్యాలెట్స్‌...

Related Articles

Latest Articles