మోక్ష‌జ్ఞ తొలి చిత్రానికి బాల‌య్యే డైరెక్ట‌ర్!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడ‌నే ప్ర‌చారం దాదాపు నాలుగేళ్ళుగా సాగుతూనే ఉంది. అప్ప‌ట్నించి అత‌ని తొలి చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రు అనే విష‌యంలో ర‌క‌ర‌కాల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. రాజ‌మౌళి మొద‌లుకుని బోయ‌పాటి శ్రీను వ‌ర‌కూ ఎన్నో పేర్లతో ఓ పెద్ద జాబితానే త‌యారైంది. అయితే… ఈ పుకార్ల‌కు నందమూరి బాల‌కృష్ణ దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ముందు అనుకున్న‌ట్టుగానే త‌న కుమారుడు మోక్ష‌జ్ఞ‌ను ఆదిత్య 369 మూవీ సీక్వెల్ తో ప‌రిచ‌యం చేయ‌బోతున్నాన‌ని, ఆ సినిమాలో తానూ న‌టిస్తాన‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో ఈ సినిమా ఆదిత్య 999 అనే పేరు పెట్టే ఆలోచ‌న ఉంద‌న్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత స‌త్యానంద్, ద‌ర్శ‌కులు సింగీతం శ్రీనివాస‌రావు త‌న‌కు తొలుత ఓ క‌థ చెప్పార‌ని, అది త‌న‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ త‌ర్వాత తానే ఓ పాయింట్ ను వారికి చెప్పి, క‌థ‌గా డెవ‌ల‌ప్ చేయ‌మ‌న్నాన‌ని బాల‌కృష్ణ తెలిపారు. ఈ క‌థ‌ను సింగీతం గారి స‌హాయ స‌హ‌కారాల‌తో తానే ద‌ర్శ‌క‌త్వం వ‌హించినా ఆశ్య‌ర్యపోన‌వ‌స‌రం లేద‌ని బాల‌య్య బాబు హింట్ ఇచ్చారు. గ‌తంలో బాల‌కృష్ణ‌ స్వీయ నిర్మాణంలో న‌ర్త‌న‌శాల‌ చిత్రాన్ని డైరెక్ట్ చేయాల‌ని అనుకున్నారు. కానీ అది కొద్ది రోజుల షూటింగ్ త‌ర్వాత ఆగిపోయింది. అప్ప‌టి నుండీ ఇప్ప‌టి వ‌ర‌కూ బాల‌కృష్ణ మ‌ళ్లీ మెగాఫోన్ ను చేతిలోకి తీసుకోలేదు. అయితే… ఇటీవ‌లే త‌న తండ్రి ఎన్టీయార్ బ‌యోపిక్ ను మాత్రం సొంత బ్యాన‌ర్ స్థాపించి, మిత్రుల‌తో క‌లిసి ఆయ‌నే నిర్మించారు. ఇప్పుడు త‌న‌యుడి కోసం మ‌రోసారి బాల‌కృష్ణ‌ నిర్మాత‌గా మార‌డంతో పాటు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లూ త‌ల‌కెత్తుకుని తండ్రి ఎన్టీయార్ బాట‌లో సాగ‌బోతున్నారు. అదే విష‌యాన్ని బాల‌కృష్ణ త‌లుచుకుంటూ త‌న‌కు 14 సంవ‌త్స‌రాల వ‌య‌సులో త‌న తండ్రి ఎన్టీయార్ త‌న‌తో తాతమ్మ క‌ల‌ చిత్రాన్ని రూపొందించార‌ని అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-