50 ఏళ్ళ ‘అత్తలూ- కోడళ్ళు’

నటశేఖర కృష్ణ నటించిన విజయవంతమైన చిత్రాల్లో ‘అత్తలూ కోడళ్ళు’ ఒకటి. కృష్ణ సరసన వాణిశ్రీ జంటగా నటించిన ‘అత్తలూ కోడళ్ళు’జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ రోజుల్లో చిన్న నిర్మాతలకు, కొత్త వారికి అచ్చివచ్చిన హీరో కృష్ణ.. నంద్యాలకు చెందిన కె.సుబ్బిరెడ్డి, ఎన్. సుబ్బారాయుడు, జె.ఎ.రామసుబ్బయ్య శెట్టి కలసి ‘నందినీ ఫిలిమ్స్’ నెలకొల్పి తొలి ప్రయత్నంగా ‘అత్తలూ-కోడళ్ళు’ చిత్రాన్ని నిర్మించారు… పి.చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. తమ సంస్థ పేరు ‘నందినీ ఫిలిమ్స్’ కాబట్టి, నంద్యాల సమీపంలో ఉన్న మహానంది పుణ్యక్షేత్రంలోని ఆలయం చూపిస్తూ టైటిల్స్ తో ఈ సినిమా ఆరంభం కావడం విశేషం.

కోడలు నిలిపిన కాపురం
ముగ్గురు అత్తలూ, ముగ్గురు కోడళ్ళ నడుమ సాగే కథతో ‘అత్తలూ కోడళ్ళు’ చిత్రం తెరకెక్కింది. మంచితనం మూర్తీభవించిన అత్తకు ఆమె కొడుకును దూరం చేస్తూ, కోడలు పట్నంలో కాపురం పెడుతుంది. ఈ కోడలుకు కోడలుగా వచ్చిన ఓ పల్లెపడచు అత్తను ఆటపట్టిస్తుంది. పట్నం చేరి ధనగర్వంతో ఉన్న కోడలు, తన కూతురిని ఓ ధనవంతునికి ఇచ్చి పెళ్ళి చేస్తుంది. ఆ ధనవంతుడు విలాసాలకు పోయి ఆస్తి గుల్ల చేస్తాడు. చివరకు పల్లెటూరి పిల్ల అని చిన్నచూపు చూసిన కోడలు కారణంగానే వారి కుటుంబం నిలుస్తుంది.

వరించిన విజయం
ఈ చిత్రంలోని “పాల పిట్టా పాలపిట్టా పరుగులెందుకు…” అంటూ సాగే పాట, “చీరకు రవికందమా…రవికకు చీరందమా…” అని మొదలయ్యే గీతం, “అమ్మమ్మో అత్తమ్మో…” అనే టీజింగ్ సాంగ్ ఆకట్టుకున్నాయి. నిర్మాతలు కొత్తవారే అయినా ఎక్కడా రాజీపడకుండా ఆ నాటి మేటి నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకొని మరీ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో సూర్యకాంతం, ఛాయాదేవి, నాగభూషణం, అల్లు రామలింగయ్య, రాజబాబు, చంద్రమోహన్, కేవీ చలం, రావి కొండలరావు, హేమలత, నిర్మలమ్మ తదితరులు నటించారు. పినిశెట్టి శ్రీరామ్మూర్తి కథ రాసిన ఈ చిత్రంలోని పాటలను ఆత్రేయ, సినారె, అప్పలాచార్య రాయగా, కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. విఎస్ఆర్ స్వామి కెమెరా పనితనం అలరించింది. మొత్తానికి కృష్ణ సినిమాల్లో ఓ సక్సెస్ ఫుల్ మూవీగా నిలచింది ‘అత్తలూ కోడళ్ళు’.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-