రేపటి నుంచే యాషెస్ సిరీస్… యాషెస్ పేరు వెనుక చరిత్రేంటి?

భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లంటే ఎంత ఆసక్తి ఉంటుందో… ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈనెల 8 నుంచి యాషెస్ సిరీస్‌ ప్రారంభం అవుతోంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియా గడ్డపై జరగనుంది. తొలి టెస్టు బ్రిస్బేన్ వేదికగా భారత కాలమానం ప్రకారం ఉ.5:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ దగ్గుతో బాధపడుతున్నందున.. తొలి టెస్టుకు దూరంగా ఉంటాడని ఈసీబీ వెల్లడించింది.

Read Also: ఈ రికార్డు సాధించిన ఒకేఒక్కడు విరాట్ కోహ్లీనే

కాగా యాషెస్ సిరీస్‌కు యాషెస్ అని పేరు రావడానికి వెనుక చాలా చరిత్రే ఉంది. 1882లో తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. దీంతో బ్రిటన్ మీడియా ఇంగ్లండ్ జట్టును ఏకిపారేసింది. ఇంగ్లీష్ క్రికెట్ జట్టు చచ్చిపోయిందని పేర్కొంటూ సంస్మరణ ప్రకటించింది. ఇంగ్లండ్ దేహాన్ని దహనం చేసి బూడిదను ఆస్ట్రేలియాకు తీసుకువెళ్తారని సెటైర్లు వేసింది. ఈ కథనాలపై అప్పటి ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ సీరియస్ అయ్యాడు. ఆ బూడిదను తాము మళ్లీ ఇంగ్లండ్ తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశాడు. దీంతో ఇంగ్లండ్ మీడియా ఆ యాషెస్‌ను తిరిగి తీసుకురావాలని కెప్టెన్ తాపత్రయపడుతున్నట్లు ప్రచురించాయి. అలా యాషెస్ అనే పేరు వాడుకలోకి వచ్చింది. అప్పటినుంచి ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు యాషెస్ సిరీస్ అని నామకరణం చేశారు. దాదాపుగా 140 ఏళ్లుగా యాషెస్ పేరుతోనే ఈ రెండు జట్లు టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాయి. రేపటి నుంచి ప్రారంభం అయ్యే సిరీస్‌లో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా కమిన్స్, ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా రూట్ వ్యవహరించనున్నారు.

Related Articles

Latest Articles