యూపీలో ఎంఐఎం అసద్ భారీ ప్లాన్స్.. ఫలిస్తాయా?

ఉత్తరప్రదేశ్లో ఎన్నికల టైం సమీపిస్తున్న కొద్ది అక్కడ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా అసెంబ్లీ, ఎంపీ స్థానాలు ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అధికంగా ఎంపీ సీట్లను కైవసం చేసుకొని కేంద్రంలో ఈజీగా వరుసగా బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగీ సర్కారును దెబ్బకొట్టేలా ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయితే తమను అయోధ్య రామమందిరం అంశం గట్టెక్కిస్తుందని బీజేపీ భావిస్తోంది. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ అయోధ్య రామమందిరానికి భూమిపూజ చేశారు. దీనిపై అనేక విమర్శలు వచ్చినా బీజేపీ సర్కారు లైట్ తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా అయోధ్య రామమందిర వివాదాన్ని బీజేపీ సర్కారే పరిష్కరించిందని ఆపార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్లో బీజేపీ తమకు కలిసొచ్చే పార్టీలతో పొత్తుపెట్టుకుని ముందుకెళుతుండగా.. కాంగ్రెస్ మాత్రం ఒంటరిగానే బరి దిగుతున్నట్లు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ కు బీజేపీని ఒంటరిగా ఎదుర్కోనే శక్తి ఉందా? అంటే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక బీజేపీకి బద్ధ వ్యతిరేకి అయిన ఎంఐఎం ఉత్తరప్రదేశ్లో యోగీ సర్కారును ఓడించమే లక్ష్యంగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఉత్తరప్రదేశ్లో ఎంఐఎం వంద సీట్లలో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.

యోగీ సర్కారు వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ఎంఐఎం రెడీ అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం నేడు అయోధ్యకు సమీపంలోని రుదౌలిలో ర్యాలీ నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరుగబోయే ఈ ర్యాలీని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభిస్తారని యూపీ ఎంఐఎం రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు షౌకత్ అలీ ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా 8, 9 తేదీల్లో సుల్తాన్ పూర్, బారాబంకీ ప్రాంతాల్లో జరిగే సభల్లోనూ అసద్ పాల్గొని ప్రసంగిస్తారు.

ఫైజాబాద్ జిల్లా పేరును 2018 నవంబర్లో అయోధ్యగా మార్చారు. అయితే ఎంఐఎం తన ఎన్నికల ప్రచారం కోసం వినియోగించిన పోస్టర్లలో అయోధ్య జిల్లాను ఫైజాబాద్ అని పేర్కొంది. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్య మాటలయుద్ధానికి తెరలేచింది. ఎంఐఎం హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తుందని వెంటనే ఆ పార్టీ నిర్వహించే ర్యాలీని రద్దు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఒవైసీ అయోధ్య సందర్శించడానికి అనుమతించబోమని హనుమాన్ గార్హి ఆలయ పూజారి మహంత్ రాజు దాస్ సంచలన ప్రకటన చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

యోగీ సర్కారును ఓడిండచమే లక్ష్యంగా బరిలో దిగుతున్న ఎంఐఎం అయోధ్యలో అప్పుడే ఎన్నికల వేడిని రాజేసింది. మూడురోజులు అక్కడే పర్యటించనున్న ఎంఐఎం అధినేత ఓవైసీ ఇది ఆరంభమేనని చెప్పకనే చెబుతున్నారు. దీంతో బీజేపీ నేతలు సైతం ఎంఐఎంను నిలువరించేందుకు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇరుపార్టీలు మతాన్ని అడ్డంపెట్టుకొని రాజకీయ లబ్ధిపొందాలని ప్రయత్నిస్తుండటం శోచనీయంగా మారింది. దీంతో ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఏదిఏమైనా ఓవైసీ పర్యటన అయోధ్యలో టెన్షన్ పుట్టిస్తుండగా ఆయన వంద సీట్ల వ్యూహం ఏమేరకు ఫలిస్తుందనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

Related Articles

Latest Articles

-Advertisement-