ఏఆర్ రెహ్మాన్, మైకెల్ జాక్సన్… లెజెండ్రీ మీటింగ్ కు ఆస్కారం కల్పించిన ఆస్కార్స్!

ఏఆర్ రెహ్మాన్… ఈ పేరు భారతీయులకి గర్వకారణం! మరి మైకెల్ జాక్సన్ సంగతి ఏంటి? ఆయనంటే అమెరికాకే కాదు యావత్ ప్రపంచానికి ఓ అద్భుతం! అయితే, ఏఆర్ రెహ్మాన్, మైకెల్ జాక్సన్ హిస్టారికల్ మీటింగ్ జరిగింది 2009లో! దాని గురించి స్వయంగా మన ఆస్కార్ విన్నరే వివరించాడు కూడా… గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా, మైకెల్ తో తన మీటింగ్ గురించి, రెహ్మాన్ తన జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ తరువాత తనకి ఆస్కార్ నామినేషన్స్ లభించాక రెహ్మాన్ హాలీవుడ్ లో ఓ ఏజెంట్ ని అపాయింట్ చేసుకున్నాడు. సదరు ఏజెంట్ పరపతి ఎంతో తెలుసుకోటానికి ఆయన ఓ పని చేసి పెట్టమని అడిగాడట! మైకెల్ జాక్సన్ తో ఓ సారి తనని కల్పించమని స్వర మాంత్రికుడు అడిగాడు. ఏజెంట్ సరేనన్నాడు.

కానీ, చాలా వారాల పాటూ ఎటువంటి ముందడుగు పడలేదు. ఎంజేని కలిసే ఛాన్సెస్ ఇక లేవని రెహ్మాన్ డిసైడ్ అయిపోయాడు. కానీ, ఆస్కార్ వేడుకలకి నాలుగు రోజుల ముందు మైకెల్ తో మీటింగ్ అంటూ ఫోన్ వచ్చిందట! ఏఆర్ రెహ్మాన్ కి అతని హాలీవుడ్ ఏజెంట్ జాక్సన్ తో మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ ఆయన నో చెప్పాడట! మరికొద్ది రోజుల్లోనే ఆస్కార్ వేడుకలు ఉండటంతో, తనకు ఆస్కార్ అవార్డ్ వస్తేనే… కింగ్ ఆఫ్ పాప్ అయిన ఎంజేని కలుస్తానని రెహ్మాన్ చెప్పేశాడట! ఆ తరువాత, ఒకటి కాదు రెండు ఆస్కార్స్ రెహ్మాన్ స్వంతం అవటం, మైకెల్ తో మీటింగ్ జరగటం చకచకా జరిగిపోయాయి…

మైకెల్ జాక్సన్ ఇంటికి వెళ్లిన రెహ్మాన్ కోసం స్వయంగా డ్యాన్సింగ్ లెజెండే డోర్ ఓపెన్ చేశాడట. చేతులకి తన ఐకానిక్ గ్లౌజెస్ తొడుక్కుని, కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకుని ఎదురొచ్చాడట. రెహ్మాన్ తో దాదాపు రెండు గంటలు మాట్లాడిన ఆయన సంగీతం, డ్యాన్స్ గురించే కాదు ప్రేమ, ద్వేషం వంటి లోతైన అంశాల గురించి కూడా తన భావాలు పంచుకున్నాడట. ఓ దశలో హఠాత్తుగా మైకెల్ జాక్సన్ లేచి నిలబడి డ్యాన్స్ చేయటం మొదలు పెట్టగానే రెహ్మాన్ కు అలౌకికమైన అనుభూతి కలిగిందట! మన ఇండియన్ లెజెండ్ తో ఇంటర్నేషనల్ లెజెండ్ అలనాటి సమావేశం… నిస్సందేహంగా చారిత్రాత్మకమే! అందులో ఎలాంటి సందేహం లేదు…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-