కుప్పంలో వైసీపీ సాధించింది ఓ గెలుపేనా?: అచ్చెన్నాయుడు

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ సాధించిన గెలుపుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి అధికార పార్టీ కుప్పంలో ఏం చేసిందో ప్రజలందరూ చూశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కుప్పంలో గెలిచామని సీఎం, మంత్రులు జబ్బలు చరుచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారని… అది కూడా ఓ గెలుపేనా అంటూ ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతో గెలిచి సిగ్గు, శరం లేకుండా సంబరాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమాయకులైన మహిళలను పుంగనూరు, ఇతర నియోజకవర్గాల నుంచి దొంగ ఓట్లు వేయడానికి తరలించారని.. చేతకాని ఎన్నికల సంఘం కూడా టీడీపీ ఓటమికి కారణమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు, మంత్రుల నిర్వాకంతో మహిళలు ముఖాలకు చీరచెంగులు అడ్డంపెట్టుకుని సిగ్గుతో తలదించుకున్నారన్నారు. కుప్పంలో వైసీపీ గెలుపును ప్రజలు అసలు లెక్కేసుకోవడం లేదన్నారు. నిజంగా ప్రజలు వైసీపీతోనే ఉంటే ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే పార్టీని మూసివేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బేతంచర్లలో టీడీపీకి నాయకుడే లేకపోయినా.. ఆరు స్థానాలు గెలిచామని అచ్చెన్నాయుడు తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సొంత వార్డులో వైసీపీ ఓడిపోయిందని… దానిపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరని అచ్చెన్నాయుడు నిలదీశారు. ప్రజల సమస్యలపై చర్చించడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి ధైర్యం లేదని.. ఒక్కరోజు అసెంబ్లీ పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే.. 7 మున్సిపాలిటీల్లో కార్యకర్తలు హోరాహోరీగా పోరాడారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 7 నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 30 శాతం ఓట్లు వచ్చాయని ముఖ్యమంత్రే చెప్పారని.. మరిప్పుడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 46శాతం ఓట్లు పొంది తన ప్రాభవాన్ని పెంచుకుందన్నారు. వైసీపీకి, టీడీపీకి పడిన ఓట్లను సరిపోల్చి చూస్తే అధికారపార్టీకి 49 శాతం ఓట్లువస్తే, టీడీపీకి 45 శాతం ఓట్లు వచ్చాయన్నారు.

5, 6 జిల్లాల్లో టీడీపీ స్వీప్ చేసిందనేది వాస్తవమన్నారు. గుంటూరు పట్టణంలో 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 1280 ఓట్లతో గెలిస్తే, ఇప్పుడు అదేస్థానంలో జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి 680 ఓట్లతో గెలిచారన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలు గుంటూరు డివిజన్లో పని చేయలేదా అంటూ నిలదీశారు. దాచేపల్లిలో వైసీపీ 11వార్డుల్లో గెలిస్తే, టీడీపీ 9 స్థానాల్లో గెలిచిందన్నారు. టీడీపీ గెలిచిన చోట్ల ఇప్పటికీ చేయాల్సిన దారుణాలు చేస్తూనే ఉన్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Read Also: మా ప్రభుత్వానికి 100కు 97 మార్కులు వచ్చాయి: జగన్

Related Articles

Latest Articles