రహదారుల చుట్టూ రాజకీయం..!

ఆంధ్రప్రదేశ్ లో రహదారుల చుట్టూ రాజకీయం ముసురుకుంటోంది. దెబ్బతిన్న రహదారులపై.. విపక్షాలు సమరభేరి మోగిస్తుంటే.. అధికార పక్షం సైతం దీటుగా స్పందిస్తూ.. టగ్ ఆఫ్ వార్ గా ముందుకు వెళ్తోంది. అవసరమైతే అప్పులు సైతం తీసుకునైనా రోడ్లు బాగు చేస్తామని ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంటే.. ఇటు టీడీపీ, జనసేన నేతలు ఈ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు యత్నిస్తున్నాయి.ఇప్పటికే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయమై మాట్లాడారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఉధృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. తమ పోరాటం వల్లే.. ప్రభుత్వంలో చలనం వచ్చిందని అంటున్న పవన్.. పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయ్యేవరకూ.. పోరాటాన్ని ఆపేది లేదని జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా కార్యోన్ముఖులను సైతం చేసే పనిలో ఉన్నారు.

మరోవైపు.. టీడీపీ నేతలు కూడా.. ఈ విషయంపై గళం పెంచుతున్నారు. పాడైన రోడ్ల గురించి విమర్శలతో వేడి పెంచుతూ.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి కూడా.. విపక్షాలకు తగ్గట్టుగా స్పందన ఎదురవుతోంది. అవసరమైతే.. 6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసైనా సరే.. సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమన్న సంకేతాలను.. మంత్రి శంకర్ నారాయణ ప్రకటించారు. టెండర్లు పిలిచినట్టు చెప్పారు.

ఇదంతూ చూస్తుంటే.. రహదారుల చుట్టూ రాజకీయ వానలు ముసురుకుంటున్నట్టే కనిపిస్తోంది. దీనిపై స్పందిస్తున్న జనం.. విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా.. తమకు కాస్త మెరుగైన దారి చూపించండి అంటూ వేడుకుంటున్నారు. దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణాలు చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. గతుకుల మార్గాల్లో.. కనీసం 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్నా.. ఒళ్లు హూనమైపోతోందంటూ.. వాస్తవాలను కళ్లముందుంచుతున్నారు. ఈ నేపథ్యంలో.. అధికార, విపక్ష నేతల రహదారి రాజకీయాలు ఎలా ఉన్నా.. సమస్య పరిష్కారమైతే చాలు అని సాధార ప్రజానీకం కోరుకుంటోంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-