మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. తనకు నివాసానికి ఎవరూ రావొద్దని.. ఏదైనా అత్యవసరమైతే తనను ఫోన్ ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.

అయితే గురువారం వైకుంఠ ఏకాదశి కావడంతో మంత్రి అవంతి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో సుపథం వద్ద ఆయన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ను ఆలింగనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు వారం క్రితమే ఆయన రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అవంతి శ్రీనివాస్ కరోనా బారిన పడటం ఇది రెండోసారి. ఫస్ట్ వేస్ సమయంలో కూడా ఆయనకు కరోనా సోకింది.

Related Articles

Latest Articles