ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణమేంటి?: కేంద్రానికి ఏపీ హైకోర్టు ప్రశ్న

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడం లేదని పేర్కొంటూ అమలాపురానికి చెందిన న్యాయవాది రమేష్ చంద్రవర్మ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన కోర్టు… ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు.. ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.

Read Also: రైతులకు శుభవార్త… చివరి గింజ వరకు కొంటాం: కేసీఆర్

ఈ కేసులో పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.రామారావు కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీని ఆదుకునేందుకు అప్పటి ప్రధాని పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిన కేంద్రం.. ఏపీ విషయంలో మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు… విభజనతో ఏపీ నష్టపోయిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. అటు కేంద్ర ప్రభుత్వం తరఫున హరినాథ్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు ఏపీకి భౌగోళిక పరిస్థితుల విషయంలో తేడాలున్నాయని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సైతం వివరాలు సమర్పించాలని చెప్పింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 20వ తేదీకి వాయిదా వేసింది.

Related Articles

Latest Articles