ఈ ప్రయత్నం సక్సెస్ అయితే.. సంచలనమే..!

పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్. డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయ్. పోటీగా.. గ్యాస్ కూడా ఆగనంటోంది. ఇలాంటి తరుణంలో.. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. బైకులు, కార్లను బయటికి తీస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. వారి ఆలోచనలు మారుతున్నాయి. కొందరైతే.. ఎలక్ట్రిక్ బైకులు కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిణామాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో సరికొత్తగా ముందుకు పోతోంది.

విజయవాడలో.. ఆటోలను ఎలక్ట్రిక్ గా మార్చేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 50 ఆటోలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి.. వాటి పని తీరును విద్యుదీకరించారు. తిరుపతి, విశాఖపట్టణం వంటి నగరాల్లోనూ ఇలాంటి పని చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మామూలుగా అయితే.. ఆటోలకు ఇంటర్నల్ కంబష్టన్ ఇంజిన్లు ఉంటాయి. వాటి స్థానంలో… రెట్రో ఫిట్ ఎలక్ట్రిక్ ఇంజిన్లు అమరుస్తున్నారు.

నూతన.. పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ – నెడ్ క్యాప్.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఆటోకు కిట్లు అమర్చే క్రమంలో లక్షన్నర రూపాయలు కానీ.. లేదంటే కిట్ కు అయ్యే ఖర్చులో 70 శాతాన్ని కానీ నెడ్ క్యాప్ భరించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పైగా… ఈ కిట్లు అమర్చిన ఆటోలు తగిన సమయంలో ఛార్జింగ్ చేసుకునేందుకు వీలుగా విజయవాడలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. స్థల సేకరణ సైతం చేస్తున్నారు.

ఈ ఆటోల బ్యాటరీలకు ఛార్జింగ్ అయిపోతే.. బ్యాటరీని వాహనం నుంచి డిశ్చార్జ్ చేసి.. సెపరేట్ గా ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు సైతం రెట్రో ఫిట్ కిట్లకు అందుబాటులో ఉంది. ఇలా.. విప్లవాత్మకమైన నిర్ణయాన్ని అమలు చేస్తున్న ఉన్నతాధికారులు.. ఆ కిట్ల ద్వారా మైలేజ్ ఎంత వస్తోంది.. ఎంత సేపు ఛార్జింగ్ చేస్తే ఎంత లాభం అన్నది లెక్కించనున్నారు. కాలక్రమంలో.. విజయవాడలోని సుమారు 41 వేల ఆటోలను విద్యుదీకరించే అవకాశం ఉంది.

ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం సైతం తగ్గేందుకు అవకాశాలుంటాయి. ఇప్పటికే.. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఈ కార్యక్రమం విజయవంతమైతే… రాజకీయంగానూ తమ పార్టీకి మైలేజ్ పెంచే అవకాశం ఉంటుందని.. కొందరు అధికార పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫలితం ఎలా ఉన్నా.. కాలుష్యం తగ్గి, ఆదాయం ఆదా అయితే.. మంచిదే కదా.. అని ఆటో డ్రైవర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-