అప్పులకోసం ఏపీ ప్రభుత్వం కసరత్తు !

కేంద్రం నుంచి నిధులను రప్పించాలి.. పెండింగ్ నిధుల కోసం సెంటర్‌పై ఒత్తిడి తేవాలి. ఇలాంటి ఆలోచనలకు ఏపీలో కాలం చెల్లిందా? నిధుల వేట పక్కన పెట్టి.. అప్పుల వేటకే ప్రాధాన్యం ఇస్తున్నారా? ఏపీ ఆర్థిక పరిస్థితి.. జరుగుతున్న పరిణామాలపై ఏపీ సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?

నిధుల సమీకరణ.. ఆదాయం పెంచుకునే మార్గాలేవి?

ఏపీ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది. అప్పులు.. పెండింగ్ బిల్లులు.. పెరగని ఆదాయం.. ఇవి చాలవన్నట్టు కరోనా కష్టకాలంలో ఎక్కువైన ఖర్చులు.. సంక్షేమానికి లెక్కకు మిక్కిలిగా నిధుల గుమ్మరింపు.. వెరసి ఏపీ ప్రభుత్వం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగి తేలుతుందనే చెప్పాలి. నిధుల సమీకరణ మాట పక్కన పెట్టి.. ఆదాయం పెంచుకునే మార్గాలు వదిలి పెట్టి.. అప్పులు ఏ విధంగా తీసుకురావాలి? దానికోసం ఎలాంటి కసరత్తు చేయాలి? అవలంభించాల్సిన పద్ధతులేంటి? ఎవరెవర్ని నియమించుకోవాలి? అనే విషయాలపైనే ఎక్కువ ఫోకస్‌ కనిపిస్తోందని సచివాలయ వర్గాల చర్చ.

భవిష్యత్‌ ఎలా అన్నది సచివాలయ వర్గాల ప్రశ్న

ఖర్చు పెడుతున్న ప్రతి పైసాకీ లెక్కలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే చెబుతోంది. విమర్శలను లైట్‌ తీసుకుంటోంది. అయితే కౌంటరుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేసిన ప్రకటనపై సచివాలయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందట. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక లక్షా 27వేల కోట్ల మేర అప్పులు తెస్తే.. వాటిల్లో ఒక లక్షా ఐదు వేల కోట్లను ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల రూపంలో వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించారు. వస్తున్న ఆదాయాన్ని రోజువారీ ఖర్చులు.. ఉద్యోగుల జీత భత్యాల కోసం వినియోగిస్తూ.. తెచ్చిన అప్పులను సంక్షేమ పథకాల కోసమే వినియోగిస్తోందా? అనే చర్చ జరుగుతోంది. ఇదే వాస్తవమైతే భవిష్యత్‌ ఎలా అన్నది సచివాలయ వర్గాల ప్రశ్న.

కేంద్రం నుంచి వచ్చే నిధులపై గతంలో ఫోకస్‌?

ఇదే సందర్భంలో మరో అంశంపైనా చర్చ మొదలైంది. గతంలో కేంద్రం నుంచి ఏయే పథకాల రూపంలో నిధులు తీసుకురావాలి..? ఎంత మేర నిధులను రాబట్టుకోవాలి..? గ్రాంట్లను ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి..? అలాగే పెండింగ్ నిధుల విడుదలకు కేంద్రంపై ఎలా ఒత్తిడి తేవాలనే అంశంపై దృష్టి పెట్టేవారు. ఇప్పుడు కూడా ఆ ఆలోచన చేస్తున్నా.. అది పెద్దగా ఎలివేట్ కావడం లేదు. కానీ.. అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే హైలైట్‌ అవుతున్నాయి. ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు.. సలహాదారుల నియామకాలపై చర్చల డోస్‌ పెరుగుతోంది. చివరకు రాష్ట్రానికి అప్పులు తేవడమే ప్రయారిటీగా మారిందనే అభిప్రాయం జనాల్లోకి వెళ్తోంది.

అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతూకంపై చర్చ!

రాష్ట్రం అదనంగా పది వేల 500 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం ఓకే చెప్పగానే.. అదే పెద్ద వెసులుబాటుగా ఆర్థికశాఖ వర్గాలు ఫీలవుతున్నాయట. ఈ అంశాన్నే ఎక్కువగా హైలైట్‌ చేస్తున్నారు.
అయితే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మధ్య సమతూకం పాటిస్తే ఆర్థిక ఇక్కట్ల నుంచి బయటపడొచ్చని.. పరిస్థితిని అదుపులోకి తేవచ్చన్నది నిపుణుల మాట. మరి.. ఆర్థిక అంశాల చుట్టూ జరుగుతున్న ప్రచారం నుంచి సర్కార్‌ ఏ విధంగా బయట పడుతుందో చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-