ఏపీ ఉద్యోగ సంఘాల తర్జనభర్జన

ఏపీలో ఉద్యోగ సంఘాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పీఆర్సీ పీటముడి వీడక పోవడంతో ఏంచేయాలో తెలీని పరిస్థితి ఏర్పడింది. వేర్వేరుగా సమావేశం అయిన ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతున్నారు. వేర్వేరు సమావేశాల అనంతరం సంయుక్తంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ పై కసరత్తు చేయనున్నాయి రెండు జేఏసీలు.

గత నెలలో ఎక్కడ ఉద్యమాన్ని వాయిదా వేశారో అక్కడి నుంచే కార్యాచరణ ప్రారంభించనున్నాయి ఉద్యోగ సంఘాలు. నిరసన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలా లేక సంక్రాంతి తర్వాత రంగంలోకి దిగాలా అనే విషయం పై తర్జనభర్జన పడుతున్నాయి ఉద్యోగ సంఘాలు. ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తోందనే భావన ఉద్యోగ సంఘాల్లో కనిపిస్తోంది.

పీఆర్సీకి సంబంధించి పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు అసహనానికి గురవుతున్నాయి. ఉద్యోగ సంఘాల తీరుపై ఉద్యోగులు సైతం కోపంగా వున్నారని తెలుస్తోంది. పదే పదే చర్చల పేరుతో ఆహ్వానించడం, విభజించి పాలించు అన్న రీతిన వ్యవహరించడం ఉద్యోగ సంఘాలకు మింగుడుపడడం లేదు. చర్చలు జరిపినా ఎక్కడ గొంగళి అక్కడే అన్న చందంగా వుండడం, ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై చర్చ జరుగుతోంది. ఈసారి తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించాలో తెలియక ఉద్యోగ సంఘాలు మథనపడుతున్నాయి. దీంతో ఉద్యమానికి రెడీ అయితేనే ప్రభుత్వం దిగి వస్తుందని భావిస్తున్నాయి.

Related Articles

Latest Articles