నా కల మీ అందరి కల కావాలి.. మనందరి కల పేదవాడి కల కావాలి..

నా కల మీ అందరి కల కావాలి.. మనందరి కల పేదవాడి కల కావాలి అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం వైఎస్ జగన్… నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం (గృహనిర్మాణశాఖ)పై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఇళ్లనిర్మాణ ప్రగతి, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కార్యాచరణ ప్రణాళిక, టిడ్కో ఇళ్లపై సమగ్రంగా చర్చించారు.. ఇళ్లనిర్మాణంపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు.. కాలనీల్లో మ్యాపింగ్, జియోట్యాగింగ్, జాబ్‌కార్డుల జారీ, రిజిస్ట్రేషన్‌ పనులు అన్నిచోట్ల దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు తెలిపారు.. 3.03 లక్షల ఇళ్లు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని.. జులై 10 కల్లా మొత్తం 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.. ఆప్షన్‌లో భాగంగా ప్రభుత్వం కట్టే ఇళ్లు శ్రావణమాసం ప్రారంభంకాగానే మొదలుపెడతాయని వివరించారు అధికారులు. జూన్‌ 2022 నాటికల్లా మొదటి విడత ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తామని.. నాణ్యత నిర్ధారణ కోసం ఇంజనీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.. ఐఐటీలు ఇతర సంస్ధల సహకారంతో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీళ్లు, కరెంటు సౌకర్యాలు ఏర్పాటులో ఏమైనా సమస్యలు ఉంటే శరవేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.. దీనిమీద మరింత ధ్యాస పెట్టాలని.. వారంరోజుల్లో అన్ని లే అవుట్లలో పనులు పూర్తికావాలని.. ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా ఛార్జీలు సహా ఇతరత్రా రేట్లు అమాంతంగా పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రూ.34వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం అన్నది ఒక కల.. గతంలో రాష్ట్రంలోకాని, దేశంలోకాని మౌలిక సదుపాయాల కల్పనకు ఇలా ఖర్చు చేసిన దాఖలాలు లేవన్న సీఎం.. ఇంత పెద్ద లక్ష్యాన్ని గతంలో ఎవరూ ఆలోచన చేయలేదు, దేవుడి దయ వల్ల ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాం.. అవినీతికి తావుండకూడదు.. నాణ్యతకు పెద్ద పీట వేయాలని.. మనసా, వాచా, కర్మేణా ఈ పనుల పట్ల అధికారులు అంకితభావాన్ని ప్రదర్శించాలని.. అప్పుడే ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతామన్నారు. నా కల నిజం కావాలంటే మీ అందరి సహకారం కావాలి.. నా కల మీ అందరి కల కావాలి.. మనందరి కల పేదవాడి కల కావాలి.. అప్పుడే ఈ కార్యక్రమం సాకారమవుతుందన్నారు. పేదవాడికి అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందించాలన్నది మన లక్ష్యం.. దేశం మొత్తం మనవైపు చూస్తోందన్న సీఎం జగన్.. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలను మురికివాడలుగా కాదు, పేదవాళ్లకు మంచి ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలన్నారు.. దీనికి పై స్థాయి నుంచి కిందిస్థాయి అధికారి వరకూ సంకల్పంతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-