ఇష్టం లేకపోతే ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవచ్చు: జగన్

విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై సీఎం జగన్ బుధవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2021–22 నుంచి 2022–23, 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో నూతన విద్యా విధానం మూడు దశలుగా పూర్తిగా అమలు కానున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. దీనిలో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను యూపీ(అప్పర్ ప్రైమరీ) స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రానున్న విద్యా సంవత్సరంలో టీచర్ల సంఖ్యను కూడా పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. టీచర్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న డైట్‌ సంస్థల సమర్థత పెంచాలని హితవు పలికారు.

Read Also: 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబులో ఇప్పటికైనా మార్పు వస్తుందా?

టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ అందాలని, టీచర్ల శిక్షణ కార్యక్రమాలపై వచ్చే సమావేశంలో వివరాలు అందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇంగ్లీష్ ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. దీని కోసం పాఠ్యప్రణాళికలో దృష్టి పెట్టాలన్నారు. పిల్లలకు ఇదివరకే డిక్షనరీలు ఇచ్చామని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ప్రతిరోజూ కనీసం మూడు పదాలు నేర్పించాలని, ఆ పదాలను వినియోగించడాన్ని అలవాటు చేయాలని తెలిపారు. వివిధ కారణాలతో విద్యాసంస్థలను నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పిస్తుందని జగన్ వెల్లడించారు. ఇష్టం ఉన్నవారు, స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనం చేయవచ్చని, లేదంటే యథాప్రకారం నడుపుకోవచ్చని సీఎం తెలిపారు. ఒకవేళ ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేస్తే వాటికి ఉన్న పేర్లు కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో విలీనానికి అంగీకరించి తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నడుపుకుంటామంటే.. నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని జగన్ సూచించారు.

Related Articles

Latest Articles