ఏపీ బీజేపీ కొత్త తరహా పేర్ల మార్పు రాజకీయం

ఏపీలో బీజేపీ స్ట్రాటజీ మారిపోతోంది. ఎప్పటికప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఈసారి కొత్త తరహా రాజకీయానికి తెర లేపింది. వివిధ ప్రధాన నగరాల్లో ముఖ్యమైన ప్రాంతాలకు ఉన్న పేర్లను మార్చాలనే డిమాండ్లను తెరపైకి తెస్తోంది. ప్రత్యేకంగా ప్రజాగ్రహ సభ తర్వాత బీజేపీ పంథాలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. అయితే బీజేపీ ఇదే దూకుడును ప్రదర్శిస్తే.. ముందు ముందు మరిన్ని సెన్సిటీవ్ అంశాలను టచ్ చేయడం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది.

ఏపీలోని ప్రధానమైన ప్రాంతాలకు ఉన్న పేర్లల్లో కొన్నింటికి మార్పులు చేర్పులు చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. గతంలో ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు విషయంలో రచ్చ జరిగింది. ఆ మేరకు కడప జిల్లా వరకు రాజకీయం రంజుగా సాగింది. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు విషయంలో స్థానిక ఎమ్మెల్యే కూడా వెనుకడుగు వేశారు. ఆ ఊపుతోనో.. లేక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వ్యూహాత్మకంగా వెళ్లాలనే ఉద్దేశ్యంతోనో కానీ.. ప్రస్తుతం ఏపీ బీజేపీ తన స్టైలు మార్చినట్టే కన్పిస్తోంది. పేర్ల మీద కొత్త రాజకీయాన్ని షురూ చేసింది. తిరుపతిలో అమిత్ షాతో భేటీ తర్వాత నుంచి ఏపీ బీజేపీ నేతల మాటల్లో, వారి వ్యూహాల్లో మార్పు కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది.

గుంటూరులో ప్రధాన ప్రాంతమైన జిన్నా టవర్ సెంటరుకు ఆ పేరు మార్చాలని.. అబ్దుల్ కలాం పేరుకానీ.. గుర్రం జాషువా పేరు కానీ పెట్టాలనే డిమాండును తెర మీదకు తెచ్చింది. పార్టీ జాతీయ నేత సత్య కుమార్ ముందుగా ఈ అంశంపై ట్వీట్ చేసిన తర్వాత బీజేపీకి చెందిన ముఖ్య నేతలంతా.. దీనిపై వరుసగా రియాక్ట్ అయ్యారు. అలాగే గుంటూరు నగర కమిషనరును కలిసి పేరు మార్చాల్సిందిగా కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఇక జిన్నా టవరుకు ఆ పేరు మార్చాలని.. లేదంటే తామే కూల్చేస్తామంటూ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు కూడా చేసేశారు. తాజాగా సోము వీర్రాజు మరో డిమాండ్ తెర మీదకు తెచ్చారు. విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పటల్ పేరు మార్చాలనే డిమాండు చేశారు సోము వీర్రాజు.

సోము వీర్రాజు చేసిన చీప్ లిక్కర్ కామెంట్ల నుంచి దృష్టి మళ్లించేందుకే జిన్నా టవర్ అంశాన్ని బీజేపీ తెర మీదకు తెచ్చారని అంతా భావించారు. అయితే కేజీహెచ్ పేరును కూడా మార్చాలంటూ.. ఆయన ప్రకటన చేసారు. దీంతో పక్కా ప్రణాళికతోనే.. మార్పు రాజకీయాన్ని తెర మీదకు తెచ్చినట్లు స్పష్టమవుతోంది. దీని ప్రకారం..భవిష్యత్తులో మరిన్ని సున్నితమైన అంశాలను బీజేపీ నేతలు కచ్చితంగా టచ్ చేసే అవకాశం ఉంది. సున్నితమైన అంశాలను టచ్ చేయడం ద్వారా.. రాజకీయంగా పుంజుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు కన్పిస్తోంది.

Related Articles

Latest Articles