‘అనురాగదేవత’కు నేటితో 40 ఏళ్లు

ఒకప్పుడు హిందీ రీమేక్స్ కు తెలుగులో విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా నటరత్న నందమూరి తారక రామారావుదే! ఆయన నటించిన “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాది కాదు ఆకలిది” వంటి హిందీ రీమేక్స్ బాక్సాఫీస్ బరిలో జయకేతనం ఎగురవేశాయి. వాటి సరసన చేరిన చిత్రం యన్టీఆర్ నిర్మించి, నటించిన ‘అనురాగదేవత’. హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషా’ ఆధారంగా ‘అనురాగదేవత’ రూపొందింది. 1982 జనవరి 9న సంక్రాంతి కానుకగా ‘అనురాగదేవత’ జనం ముందు నిలచి, వారి మనసులు గెలుచుకుంది.

కథ విషయానికి వస్తే – బి.ఏ, చదువుకున్న రాము లారీ డ్రైవర్ గా పనిచేస్తూ గౌరవంగా జీవిస్తూంటాడు. ఓ సారి ప్రముఖ గాయని రూపాదేవి కారు చెడిపోతే, తన లారీలో లిఫ్ట్ ఇస్తాడు రాము. అప్పటి నుంచీ వారి మధ్య పరిచయం పెరుగుతుంది. రాము, రూపలో ఓ స్నేహితురాలిని చూస్తాడు. రూప మనసులో రాముని ఆరాధిస్తూ ఉంటుంది. అతను తులసి అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. వారిద్దరూ పెళ్ళి చేసుకుంటారు. ఆ పెళ్ళి రాము తల్లికి ఇష్టం ఉండదు. రాము ఓ ప్రమాదంలో చనిపోయాడని తెలిసి, అతని తల్లి నానా మాటలు అని తులసిని ఇంటి నుండి వెళ్లగొడుతుంది. ఆమె చావాలనుకుంటుంది. ఆమెను రక్షించి, తమ కాలనీకి తీసుకువెళతారు కొందరు. ప్రమాదంలో తులసికి కంటి చూపు పోతుంది. ఆమె ఓ పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. రాము ప్రమాదం నుండి కోలుకొని ఇంటికి వస్తాడు. భార్య లేకపోవడంతో పిచ్చివాడై తిరుగుతూ ఉంటాడు. రూప అతణ్ణి చేరదీసి, మళ్ళీ మనిషిని చేస్తుంది.

తులసి కూతురు రామతులసి బొమ్మలు అమ్ముతూ, రూపకు దగ్గరవుతుంది. ఆ పాప తల్లికి కళ్లు లేవని తెలిసి, డాక్టర్లకు చూపించి, ఆపరేషన్ చేస్తే చూపు వస్తుందని తెలుసుకుంటుంది రూప. ఈ విషయం రాముకు చెబుతుంది. అతను తులసిని చూసివుండడు. ఆపరేషన్ సక్సెస్ అయి, తులసికి చూపు వస్తుంది. రూప, ఆమెను ఓ అక్కలా భావిస్తుంది. రాము, రూప పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. ఆ పెళ్ళిలో రూపను పెండ్లికూతురుగా ముస్తాబు చేస్తుంది తులసి. అక్కడే పెళ్ళిపీటల మీద పెళ్ళికొడుకుగా కూర్చున్న రామును చూసి, అక్కడ నుండి వెళ్తుంది తులసి. రూపకు విషయం తెలుస్తుంది. రామును, తులసిని, పాపను కలిపి, తాను మళ్ళీ ఒంటరిగా పాటలు పాడుకుంటూ ఉంటుంది రూప.

యన్.టి.రామారావు, జయసుధ, శ్రీదేవి, గుమ్మడి, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, మిక్కిలినేని, ముక్కామల, కవిత, ఋష్యేంద్రమణి, అన్నపూర్ణ, బేబీ అనూరాధ, జానకి నటించారు. ఇందులో బాలకృష్ణ ఓ ముఖ్యపాత్ర పోషించారు. హిందీలో జితేంద్ర పోషించిన పాత్రలో యన్టీఆర్, తాళ్ళూరి రామేశ్వరి పాత్రలో జయసుధ, రీనారాయ్ పాత్రలో శ్రీదేవి తెలుగులో నటించారు. హిందీలో గిరీశ్ కర్నాడ్ పోషించిన పాత్రకు కొన్ని మార్పులు చేసి, దానిని బాలకృష్ణతో ధరింప చేశారు.

చక్రవర్తి స్వరకల్పన చేసిన ఈ చిత్రానికి వీటూరి, వేటూరి పాటలు పలికించారు. అన్ని పాటలూ జనాదరణ పొందాయి. “చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా…” పాట విశేషాదరణ చూరగొంది. ఇక “ముగ్గురమ్మల కన్నా ముద్దుల మాయమ్మా…”, “అందాల హృదయమా…అనురాగ నిలయమా…”, “నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూట…”, “ఆడవే గోపికా…” పాటలు సైతం జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి.

Related Articles

Latest Articles